సోలార్‌తో విద్యుత్‌ బిల్లుకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

సోలార్‌తో విద్యుత్‌ బిల్లుకు చెక్‌

Oct 11 2026 12:09 AM | Updated on Oct 11 2026 12:09 AM

● పీఎం సూర్యఘర్‌ పథకంతో ఊరట ● రూ.78 వేల వరకు సోలార్‌ ప్లాంట్‌పై రాయితీ

● పీఎం సూర్యఘర్‌ పథకంతో ఊరట ● రూ.78 వేల వరకు సోలార్‌ ప్లాంట్‌పై రాయితీ

కొత్తపల్లి(కరీంనగర్‌): మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న విద్యుత్‌ ఉపకరణాల వినియోగంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్‌ బిల్లుల భారం పెరుగుతోంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం పెరగడంతో ప్రతినెలా విద్యుత్‌ బిల్లుల మోత మోగుతోంది. అంతేగాకుండా ఎలక్ట్రిక్‌ కార్ల రంగ ప్రవేశంతో విద్యుత్‌ వినియోగం మరింతగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకునేందుకు సౌర విద్యుత్‌ ఓ ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తోంది. ఇంటి పైకప్పుపైనే సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పొందే అవకాశాన్ని పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన కల్పిస్తోంది. అర్హులైన గృహ వినియోగదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే విద్యుత్‌ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

సోలార్‌తో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గింపు

ఇంటి పైకప్పుపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా సూర్యరశ్మీతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనివల్ల గ్రిడ్‌ నుంచి వినియోగించే విద్యుత్‌ పరిమాణం తగ్గి, నెలవారీ బిల్లుపై గణనీయమైన ఆదా పొందవచ్చు. సోలార్‌ ప్లాంట్‌ సామర్థ్యం, ఇంటి విద్యుత్‌ వినియోగం, సౌర విద్యుత్‌ ఉత్పత్తిని బట్టి విద్యుత్‌ బిల్లు జీరోకు చేరే అవకాశం కూడా ఉంది. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటును బ్యాంకులు సైతం ప్రోత్సహిస్తూ రుణ సదుపాయం అందిస్తున్నాయి.

గరిష్ఠంగా రూ.78 వేల రాయితీ

పీఎం సూర్య ఘర్‌ పథకం కింద అర్హులైన గృహ విద్యుత్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఒక కిలోవాట్‌ సోలార్‌ ప్లాంట్‌కు రూ.30,000, రెండు కిలోవాట్లకు రూ.60,000, మూడు కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000 వరకు రాయితీ లభిస్తుంది. పథకం నిబంధనలు, అర్హతలు, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఈ రాయితీ వర్తించనుంది. మూడు కిలోవాట్ల రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా అనుకూల పరిస్థితుల్లో నెలకు సుమారు 360 యూనిట్లు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అయితే వాతావరణ పరిస్థితులు, సూర్యరశ్మీ లభ్యత, ప్లాంట్‌ పనితీరును బట్టి ఉత్పత్తిలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

అర్హులైన గృహ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌, ఆమోదిత విక్రేత ఎంపిక, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు, తనిఖీ, నెట్‌ మీటరింగ్‌ తదితర ప్రక్రియలను పథకం మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేస్తారు. సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకునే ముందు ఇంటి విద్యుత్‌ వినియోగం, అవసరమైన ప్లాంట్‌ సామర్థ్యం, పైకప్పుపై అందుబాటులో ఉన్న స్థలం, మొత్తం వ్యయం, సబ్సిడీ అర్హతలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement