ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మీసేవ కేంద్రాల్లో ధరల పట్టిక ప్రకారం చార్జీలు చెల్లించి రశీదు పొందాలని జిల్లా మీసేవ సెంటర్ల ఈడీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పాతబస్టాండ్‌లోని మీసేవ సెంటర్‌ను డీఎం మహేశ్‌తో కలిసి తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మీసేవ కేంద్రంలో ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో ఆపరేటర్‌ను తొలగించి, కొత్త ఆపరేటర్‌ను నియమించినట్లు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయాన్ని తెలిపారు. చిన్నపిల్లల ఆధార్‌కార్డుల విషయంలో ఎలాంటి చార్జీలు ఇవ్వకూడదన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ సిరిసిల్ల మినీస్టేడియంలో ఆదివారం నిర్వహించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి అండర్ 10, 12, 14 విభాగాల్లో పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. విజేతలకు మెరిట్ సర్టిఫికెట్స్, మెడల్స్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 11న కొమురంభీం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, శైలజ పాల్గొన్నారు.
ఎగువమా‘నీటి’ విడుదల
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ఆయకట్టు పరిధిలో పొలాలకు సాగునీరు విడుదల చేయడంపై బీజేపీ నాయకులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరున్నా పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ నాయకులు, రైతులు రెండు రోజుల క్రితం ఆందోళన చేశారు. రైతుల పరిస్థితిని పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు ఎడమ, కుడి కాలువల ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, రైతులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోడె రమేశ్, మల్లేశ్‌యాదవ్, నాయకులు దేవేందర్‌యాదవ్, ఎల్లం, రాజు, సర్వోత్తం, సత్యనారాయణ, దేవసాని కృష్ణ, ఎలేందర్, అనిల్ పాల్గొన్నారు.


