● ఈతకు వెళ్లి మానేరులో మునిగి వ్యక్తి మృతి
సుల్తానాబాద్‌రూరల్: ఆదివారం సరదాగా గడిపేందుకు వనభోజనాలకు వెళ్లిన కుటుంబంలో విషాదం అలుముకుంది. అప్పటి వరకు అందరూ కలిసి వంటలు పూర్తి చేసుకొని.. భోజనాలకు సిద్ధమవుతుండగా ఈతకొట్టేందుకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు. సుల్తానాబాద్ పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన కారు డ్రైవర్ ఎం.డి.జహంగీర్(38) ఆదివారం భార్య, కూతుళ్లు, అల్లుళ్లు, తన బాబాయి కూతుళ్లు, అల్లుళ్లతో కలిసి నీరుకుల్లలోని మానేటి శ్రీరంగనాయకస్వామి ఆలయం సమీపంలో వన భోజనాలకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి వంటలు చేసుకున్నారు. భోజనం చేసేందుకు సిద్ధమవుతుండగా తన బాబాయ్, అల్లుళ్లతో కలిసి మానేరువాగులో ఈత కొట్టేందుకు దిగారు. జహంగీర్ ఊపిరి ఆడక ఈత కొట్టలేకపోయాడు. నీటిలో మునిగిపోతున్న జహంగీర్‌ను కుటుంబ సభ్యులు కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండాపోయింది. దీంతో నీరుకుల్ల గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి గాలించగా మృతదేహం బయటపడింది. పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
కోతుల దాడిలో సింగరేణి కార్మికుడికి గాయాలు
యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం ఆర్జీ–2 ఏరియా పోతనకాలనీ 49బ్లాక్ 685క్వార్టర్‌లో నివాసం ఉంటూ వకిల్‌పల్లి గనిలో జనరల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు బైరెడ్డి విశాక్ ఆదివారం కోతుల దాడిలో గాయపడ్డాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం విశాక్ తన ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఇంటిపై ఉన్న 10కోతులు ఒకేసారి దాడి చేయడంతో కాలు, చేతులు, శరీరంపై గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు కాలనీ డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు.
ఒకరిపై దాడి.. కేసు నమోదు
మానకొండూర్: మండలకేంద్రంలోని తూర్పు దర్వాజా సమీపంలో శనివారం రాత్రి ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేయగా.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మానకొండూర్ రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన పార్వతం నరసింహ(30) తన తమ్ముడు సిరిగిరి హరీశ్‌తో కలిసి కిరాణాషాపునకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఇదే గ్రామానికి చెందిన సుధీర్, ప్రణయ్, చింటూ అడ్డుకుని దాడి చేశారు. నరసింహ రోడ్డు పక్కనున్న డ్రైనేజీలో గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ పి.శ్రీలత తెలిపారు.


