● ఇప్పటికే రూ.150 కోట్లతో పనులు ● వివరాలు వెల్లడించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటికే రూ.150కోట్లతో పనులు మొదలుకాగా.. మొత్త ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.249.40 కోట్లకు చేరుకున్నట్లు వివరించారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.50కోట్లు, 2024–25లో రూ.100 కోట్లు విడుదల చేయగా.. తాజాగా రూ.99.40 కోట్లు మంజూరు చేసింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిసరాలను ఆధునికీకరించడం లక్ష్యమన్నారు. ఇప్పటికే రాజన్న ఆలయంలో 45 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈ నిధులతో మిగిలిన నిర్మాణాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఆలయ పరిసరాల సుందరీకరణ పనులు వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ పూర్తయితే ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక రంగంలోనూ వేములవాడ ప్రాధాన్యం సంతరించుకుంటుందన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.


