సిరిసిల్ల: ఆధ్యాత్మిక సేవల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పీఎస్‌కే సంస్థ అధినేత డాక్టర్ పుల్లూరి శ్రీకాంత్ రూ.కోటి విరాళంగా అందించారు. టీటీడీ చేస్తున్న మహాత్తర సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారంగా రూ.కోటి విరాళాన్ని టీటీడీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బుధవారం అందించారు. శ్రీవేంకటేశ్వరస్వామి కృపాకటాక్షాలు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ.. విరాళాన్ని అందించినట్లు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీ.ఆర్.నాయుడు పుష్పగుచ్ఛంతో శ్రీకాంత్‌ను అభినందించారు. సిరిసిల్లకు చెందిన యువ పారిశ్రామికవేత్త, పీఎస్‌కే సంస్థ వ్యవస్థాపకుడు పుల్లూరి శ్రీకాంత్ స్టీల్, సిమెంట్ వ్యాపార రంగాన్ని హైదరాబాద్ కేంద్రంగా విస్తరించారు. టీటీడీకి భారీ విరాళం ప్రకటించడంపై శ్రీకాంత్ తల్లిదండ్రులు పుల్లూరి రాధా, కృష్ణమూర్తి దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఆ దేవదేవుడే శ్రీకాంత్ వ్యాపారాలను ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
టీటీడీ చైర్మన్‌కు అందజేసిన సిరిసిల్ల యువ పారిశ్రామికవేత్త


