● తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్
సిరిసిల్ల: కోవిడ్ సమయంలో 2020, మార్చి 26న జారీ చేసిన తాత్కాలిక ఈ–ఫార్మసీ నోటిఫికేషన్‌ను ఇప్పటికీ కొనసాగించడం సమంజసం కాదని, ఆ నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించాలని తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ కోరారు. సిరిసిల్లలో శనివారం మాట్లాడారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈనెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను బంద్ చేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ–ఫార్మసీ ప్లాట్‌ఫారమ్స్ నియంత్రణ, సడలింపులను దుర్వినియోగం చేస్తుందన్నారు. భౌతిక ధ్రువీకరణ లేకుండా మందుల విక్రయించడం ద్వారా యాంటీమైకోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మెడికల్ షాపుల మనుగడను కార్పోరేట్ సంస్థలు దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ–ఫార్మసీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు తొడుపునూరి రాజు, పెండెం కృష్ణకుమార్, శేషాద్రి, రాము తదితరులు పాల్గొన్నారు.


