● వన్యప్రాణుల దాహార్తి తీరేదెలా? ● ఖాళీగానే సాసర్ పిట్లు ● కొన్ని ప్రాంతాల్లో ధ్వంసం
కోనరావుపేట(వేములవాడ): ఎండలు మండిపోతున్నాయి. అటవిలోని నీటివనరులు చెరువులు, కుంటలు అడుగంటిపోతున్నాయి. అడవి జంతువులకు నీళ్లు దొరక్క అల్లాడిపోతున్నాయి. వన్యప్రాణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటవీజంతువుల దాహం తీర్చేందుకు ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో అడవిలో సాసర్ పిట్సు ఏర్పాటు చేశారు. ఏటా వేసవికి ముందే వీటిని శుభ్రం చేసి, ట్యాంకర్ల ద్వారా నీటిని నింపాల్సి ఉంటుంది. కానీ ఈ వేసవిలో పిట్స్ చెత్తాచెదారంతో నిండిపోయాయి.
వృథాగా 40 సాసర్ పిట్స్
అటవీ లోతట్టు ప్రాంతాల్లో నీటి వనరులు ఎండిపోవడంతో దాహార్తిని తీర్చుకునేందుకు జింకలు, కోతులు, నెమళ్లు, అడవిపందులతోపాటు ఇతర వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. కోనరావుపేట మండల కేంద్రంతోపాటు మరిమడ్ల, శివంగాలపల్లి, ఏగ్లాస్‌పూర్, నిజామాబాద్, వట్టిమల్ల, కంచర్ల, అడవిపదిర, పోతిరెడ్డిపల్లి అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సుమారు 40 సాసర్ పిట్స్ నీరు లేక బోసిపోయాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన ఉన్న అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.


