సిరిసిల్ల అర్బన్: ప్రజావాణికి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 253 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలన్నారు.
తంగళ్లపల్లిలోని ఇంటి నంబర్ 9–74పై లోక్ అదాలత్ డిక్రీ అమలు చేసి నా పేరిట మ్యూటేషన్ చేయాలని ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను అమలు చేయకుండా ఆలస్యం చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా సదరు అధికారులపై విచారణ చేపట్టి, నాకు న్యాయం చేయండి.
– వీర్ల అలియాస్ కూడ లక్ష్మి, సిరిసిల్ల
వేములవాడ మండలం కొడుముంజ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని 15 గుంటల ప్రభుత్వ భూమిని గ్రామపంచాయతీ తీర్మానంతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలి.
– కొడుముంజ గ్రామస్తులు
మాది సిరిసిల్ల పరిధిలోని ఒకటో వార్డు రగుడు. మా ఊరిలో రబీ, ఖరీఫ్ సీజన్లలో 700 నుంచి 900 క్వింటాళ్ల వరకు వడ్లు పండిస్తున్నాము. వడ్లు ఆరబెట్టడానికి ఇబ్బందిగా ఉంది. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం మూడెకరాలు కేటాయించాలి. – రగుడు అభివృద్ధి కమిటీ
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్‌రూమ్ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలి. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని పలు సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.
– పెద్దూరు, డబుల్ బెడ్‌రూమ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు


