అర్బన్‌బ్యాంకులో వసూళ్లపర్వం అక్రమంగా ‘కాంట్రాక్ట్’ నియామకాలు ఆరు క్లర్క్ పోస్టులకు రూ.24లక్షలు వసూలు విచారణ అధికారిని నియమించిన సహకారశాఖ
సిరిసిల్ల: సిరిసిల్ల సహకార అర్బన్‌బ్యాంక్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించిన ఆరు క్లర్క్ పోస్టుల్లో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు వచ్చిన కథనాలపై స్పందించిన అధికారులు నివేదిక ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. తొలుత మార్చి నెలాఖరు ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా నివేదిక ఆలస్యమైందని చెప్పినా అధికారులు ఏప్రిల్ మొదటి వారం గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. పాలకవర్గంలోని కీలక నేతలే భారీగా డబ్బులు వసూలు చేసినట్లు వెలుగుచూసింది. ఆరు క్లర్క్ పోస్టులకు మొత్తంగా రూ.24లక్షల వరకు వసూలు చేసినట్లు ‘సాక్షి’లో మార్చి 26న కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా సహకార అధికారి స్పందిస్తూ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సదరు బ్యాంకు అధికారులను ఆదేశించారు. మరోవైపు అక్రమ నియామకాలపై నిగ్గు తేల్చేందుకు సహకారశాఖకు చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ రాములును నియమించారు. రాములు అర్బన్ బ్యాంకును సందర్శించి ఆరా తీశారు.
పెండింగ్‌లోనే ఆ రెండు పోస్టులు
సహకార అర్బన్ బ్యాంకులో రెండు మేనేజర్ పోస్టులు, ఆరు క్లర్క్ పోస్టుల భర్తీకి 2025 అక్టోబరులో నోటిఫికేషన్ జారీ చేశారు. మేనేజర్ పోస్టులకు నలుగురు, క్లర్క్ పోస్టులకు 63 మంది దరఖాస్తు చేశారు. ఆరు నెలల తర్వాత నియామకాలు చేపట్టారు. ఆరుగురు క్లర్క్‌లను నియమించి, మేనేజర్ పోస్టులను పెండింగ్‌లో పెట్టారు. మరో దఫా.. ఆ రెండు పోస్టులను భర్తీ చేయాలని, దానికి వేరే‘లెక్క’ వసూలు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఆరుగురు నియామకంలో బ్యాంకు అభివృద్ధిని కాంక్షించకుండా.. పైరవీలతో పైసలు తీసుకుని భర్తీ చేయడం చర్చనీయాంశమైంది.
పర్మినెంట్ అవుతాయనే ఆశతో..
అర్బన్ బ్యాంకులో ఉద్యోగమంటే స్థానికంగానే అందుబాటులో ఉంటూ.. హాయిగా చేసుకోవచ్చనే నమ్మకంతోనే ఆరుగురు అభ్యర్థులు పాలకవర్గంలోని ఓ కీలక నేత చుట్టూ తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగాలు సాధించారు. ఆ ఉద్యోగం రూ.15వేలు జీతమే ఉండగా భవిష్యత్‌లో పర్మినెంట్ అవుతుందనే ఆశతోనే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. ఉద్యోగాలు సాధించిన నవీన్, శివచరణ్, గీత, అనామిక, స్వేత, మజీరొద్దీన్‌లో మేం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు సాగలేదని పేర్కొంటూ వ్యక్తిగతంగా పత్రాలు రాయించుకున్నట్లు సమాచారం.
ముడుపుల పంపకాల్లో విబేధాలు
అర్బన్‌బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలకు పాల్ప డ్డారు. ఆరుగురు అభ్యర్థులను పాలకవర్గంలోని కీలక డైరెక్టర్లు ప్రతిపాదించారు. ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లుగా సదరు డైరెక్టర్లు ప్రకటించి రూ.18 లక్షలను పాలకవర్గంలోని అందరికీ పంపకాలు చేపట్టారు. కానీ తెరచాటుగా మరో రూ.6లక్షలు వసూలైనట్లు తెలిసి విభేదాలు పొడచూపడంతో ఈ వసూళ్లపర్వం వెలుగులోకి వచ్చింది.


