● కొత్త పంచాయతీల ప‘రేషాన్’ ● పంచాయతీ ఏర్పడ్డ.. రేషన్
ముస్తాబాద్(సిరిసిల్ల): చిన్నపల్లెలను పంచాయతీలు చేసిన అధికారులు చౌకధరల దుకాణాలు మంజూరు చేయలేదు. బియ్యం కోసం లబ్ధిదారులు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్న దుస్థితి. నిబంధనల పేరుతో చిన్నపంచాయతీలు చౌకధరల దుకాణాలకు నోచుకోవడం లేదు. ఏళ్లుగా పొరుగూరు నుంచి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్న లబ్ధిదారులకు కొత్త పంచాయతీలోనూ నడక తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో ఏడేళ్ల క్రితం కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు రేషన్‌దుకాణాలు మంజూరు చేయలేదు. వీర్నపల్లి, రుద్రంగి మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. వీర్నపల్లి గిరిజన మండలంలో 17 గ్రామాలు ఉండగా.. పది తండాలలో రేషన్‌దుకాణాలు లేవు. రుద్రంగి మండలంలో పది గ్రామాలకు మూడు గ్రామాల్లోనే రేషన్ దుకాణాలు ఉన్నాయి.
నిబంధనలతో లబ్ధిదారుల ఇబ్బందులు
నిబంధనలతో కొత్త చౌకధరల దుకాణాల మంజూరుకు ఆటంకం కలుగుతోందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఒక రేషన్ దుకాణం నుంచి మరో దుకాణానికి కనీసం 3 కిలోమీటర్లు ఉండాలని సూచిస్తున్నాయి. కనీసం 300 రేషన్‌కార్డులు, 30 క్వింటాళ్ల కోట ఉండాలనే నిబంధనలతో చిన్న గ్రామాలైన కొత్త పంచాయతీలకు దుకాణాలు మంజూరుకావడం లేదు. మారుమూల తండావాసులు, పల్లెప్రజలు ద్విచక్ర వాహనాలపై, ఆటోలపై వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్‌లు తమ కోట బియ్యాన్ని ప్రత్యేక వాహనాలలో గ్రామాలకు తీసుకొచ్చి పంపిణీ చేయిస్తున్నారు.
ప్రతిపాదనలకు లభించని మోక్షం
జిల్లాలో కొత్తరేషన్ దుకాణాల మంజూరుకు ఆయా మండలాల తహసీల్దార్లు చేస్తున్న ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు. జిల్లా అధికారులు సివిల్ సప్లయ్ అధికారులకు చేస్తున్న ప్రతిపాదనలు బుట్టదాఖలు అవుతున్నాయనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పదమూడేళ్ల క్రితం ఏర్పడిన పంచాయతీలకు ఇప్పటికీ రేషన్ దుకాణాలు లేకపోవడం విచారకరం.
● కొత్త పంచాయతీల ప‘రేషాన్’ ● పంచాయతీ ఏర్పడ్డ.. రేషన్


