లెక్కలేస్తున్నారు
● ఫలితాలపై ఉత్కంఠ ● సిరిసిల్ల, వేములవాడల్లో చర్చ ● పురపీఠాలు ఎవరిపరమో.. ● ఎంతో ధీమా .. అంతే భయం
సిరిసిల్ల: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఓట్ల లెక్కలు తీస్తున్నారు. పంపిణీ చేసిన డబ్బులు ఎంత.. వచ్చే ఓట్లు ఎన్ని అని అంచనాల్లో గురువారం మునిగితేలారు. అనుచరులు, అనుయాయులతో రోజంతా చర్చలు జరిపారు. గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నా అంతకుమించి భయం మాత్రం లోలోన ఉంది. సిరిసిల్లలో 39 వార్డులకు 170 మంది, వేములవాడలో 28 వార్డులకు 113 మంది పోటీ చేశారు. బుధవారం ఎన్నికలు ముగియడంతో ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. అనుచరులు మాత్రం ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి వచ్చే ఓట్లను అంచనా వేస్తున్నారు.
ఖరీదైన ఎన్నికలు
మున్సిపల్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా ఖరీదుగా మారాయి. గెలుపు కోసం ఖర్చుకు వెనుకాడకుండా ముందుకెళ్లారు. సిరిసిల్లలోని ఓ వార్డులోని ప్రధాన పార్టీ అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.10వేల చొప్పున పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో ఏకగ్రీవమైన సదరు అభ్యర్థి ఇప్పుడు గెలుపే లక్ష్యంగా ముందుగా ఓటుకు రూ.5వేలు ఇవ్వగా.. ప్రధాన ప్రత్యర్థి రూ.7వేలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మరో రూ.5వేల చొప్పున పంపిణీ చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గుర్తులను నమ్ముకోగా, ఇండిపెండెంట్లు మాత్రం డబ్బులను నమ్ముకుని ముందుకెళ్లారు. మొత్తంగా సిరిసిల్లలో రెండు రోజుల్లో రూ.25కోట్ల వరకు ఓటర్లకు పంపిణీ చేసినట్లు అంచనా. అతి తక్కువగా కొన్ని రిజర్వు వార్డుల్లో రూ.500 చొప్పున పంపిణీ చేశారు. వేములవాడలో మొత్తంగా రూ.15కోట్ల వరకు ఖర్చు చేసినట్లు భావిస్తున్నారు. భూములను అమ్మి, ఇళ్లను కుదవపెట్టి మరీ బరిలో దిగారు.
ఓట్లు సీట్లపై అంచనాలు
సిరిసిల్ల, వేములవాడల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఎవరికీ వారు ఓట్లు అంచనా వేస్తున్నారు. అనుచరులు చెప్పే మాటలు నమ్మి ఽధీమాగా ఉన్నారు. కొందరు ఉత్కంఠగా ఫలితాల కోసం నిరీక్షిస్తుంటే ఇంకొందరు విజయం సాధించినట్లు భాస్తున్నారు.
పెరిగిన ఓటింగ్ ఎవరికీ అనుకూలం
సిరిసిల్లలోని కొన్ని వార్డుల్లో పోలింగ్‌శాతం 81 నుంచి 86 శాతం వరకు నమోదైంది. మరికొన్ని వార్డుల్లో 66 నుంచి 72 శాతంలోపే నమోదుకావడం గమనార్హం. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పెరిగిన ఓటింగ్ తమకే అనుకూలంగా వస్తుందని ఎవరి ధీమాలో వారు ఉన్నారు. 1, 9, 10, 22, 31, 32, 34 వార్డుల్లో పోలింగ్ 83 నుంచి 89 శాతంగా నమోదైంది. 5, 6, 17, 18, 27, 28, 39 వార్డుల్లో పోలింగ్ 65 నుంచి 70 శాతంలోపే నమోదైంది. రగుడు, సర్ధాపూర్, ముష్టిపల్లి, చిన్నబోనాలు, పెద్దబోనాల, గోపాల్‌నగర్, టీఆర్‌నగర్, బీవై నగర్, సుందరయ్యనగర్‌లలోని వార్డుల్లో అత్యధికంగా ఓటర్లు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతనగర్, గాంధీనగర్, అంబేడ్కర్‌నగర్, పత్తిపాకవీధి, సుభాష్‌నగర్, నెహ్రూనగర్‌లలో ఓటేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఓటింగ్‌శైలి తమ గెలుపోటములపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందోనని అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు.


