ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత
● బందోబస్తులో 250 మంది పోలీసులు ● విజయోత్సవ ర్యాలీలు నిషేధం ● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల క్రైం: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సిరిసిల్ల, వేములవాడల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. 250 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్‌ర్యాలీలు తీయొద్దని సూచించారు.
మహాశివరాత్రికి పకడ్బందీగా భద్రత
మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జాతర ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భీమేశ్వర ఆలయంతోపాటు బద్దిపోచమ్మ, నాంపల్లి, అగ్రహారం ఆలయాల వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ నిఘా వంటి చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా పెంచా లని, లౌడ్‌స్పీకర్ల ద్వారా భక్తులకు సూచనలు అందించాలని ఆదేశించారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు వీరప్రసాద్, కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మధుకర్, రవి, నాగేశ్వరరావు, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, రమేశ్ ఉన్నారు.


