రాయబేరాలు
అన్నా.. నువ్వు గెల్సుడు గ్యారంటీ
మద్దతుకు మంతనాలు
ఉపసంహరణకు వ్యూహాలు
ఏకగ్రీవాలకు ఎత్తుగడలు
రంగంలోకి ముఖ్యనేతలు
ఈనెల 3న ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
బుజ్జగింపులు...
సిరిసిల్ల: బుజ్జగింపుల పర్వం మొదలైంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు రాయబేరాలు ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించేందుకు వారి సన్నిహితులతో పావులు కదుపుతున్నారు. సిరిసిల్లలో 429, వేములవాడలో 260 నామినేషన్లు వేశారు. వేములవాడలో 29, సిరిసిల్లలో 59 మంది స్వతంత్రులు నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పోటీ నుంచి తప్పించే ప్రయత్నిస్తున్నారు.
బరిలో దిగాలా... బందుకు జరగాలా !
కౌన్సిలర్లుగా పోటీ చేసి రాజకీయంగా ఎదగాలనే ఆశతో చాలా మంది నామినేషన్లు వేశారు. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రత్యర్థులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రత్యర్థులకు భారీ నజరానాలు ఆఫర్ చేస్తున్నారు. ఎన్నికల ఖర్చు భరించడం ఇబ్బంది అవుతుందని బరిలో ఉండాలా? వద్దా? అనే ఆలోచనలో కొందరు పడ్డారు. ఎదుటి వారు ఇచ్చే ఆఫర్లు తీసుకొని పక్కకు జరగాలనే ఆలోచనలో మరికొందరు ఉన్నట్లు సమాచారం.
రంగంలోకి ముఖ్యనాయకులు
అభ్యర్థుల జాబితా ఆధారంగా ముఖ్యనాయకులు బుజ్జగింపులకు రంగంలోకి దిగారు. సాధ్యమైనన్ని వార్డుల్లో ఏకగ్రీవాలతో ముగించాలని ప్రధాన పార్టీల నాయకులు భావిస్తున్నారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు, వేములవాడలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో సిరిసిల్లలో మూడు కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈసారి కూడా అదే పట్టుదలతో బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్రులు కూడా ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రత్యర్థులపై ప్రలోభాల వల విసురుతున్నారు. తప్పుకుంటే భవిష్యత్‌లో పదవులు ఇస్తామని, కాంట్రాక్టు పనులు అప్పజెప్పుతామని, పార్టీలో ప్రాధన్యమైన పదవులు అందిస్తామని ఆఫర్లతో చర్చలు సాగిస్తున్నారు.
‘అన్నా.. నువ్వు గెల్సుడు గ్యారంటీ. మొన్నటిసారి మన వార్డుల గంత కష్టపడినం. కొద్దిల మిస్సయింది. ఈసారి మాత్రం గెలుపు మనదే. పోటీల ఉండుడే. నువ్వు గెల్వకుంటే మేం గుండు గీయించుకుంటం. మావోడైతే మీసాలే గీయించుకుంటానని చెప్తుండు’... నామినేషన్లు వేసిన అభ్యర్థుల వద్ద అనుచరులు చెబుతున్న మాటలు. నమ్మినబంటుగా ఉండే ద్వితీయశ్రేణి నేతలు వీధులవారీగా వార్డుల్లో ఓట్లు అంచనా వేస్తూ భారీ మెజార్టీ కళ్లముందు ఉంచుతున్నారు. సన్నిహితుల మాటలకు ఒకింత సంబరంగా ఉన్నా.. లోలోన మాత్రం తెలియని భయం అభ్యర్థిని వెంటాడుతోంది. గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుందంటూ అనుచరులను ఆరా తీస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో అభ్యర్థుల వద్ద వారి అనుచరులు గొప్పలు చెబుతున్నారు. అన్నో నిన్నే నమ్ముకుని పది రోజులుగా పనిచేస్తున్నం. ఇప్పుడు నువ్వు తప్పుకుంటే మా గతి అటు.. ఇటు కాకుండా పోతది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుచరుల మాటలను అంచనా వేస్తూ ఎన్నికల్లో అయ్యే ఖర్చులను లెక్కిస్తూ అభ్యర్థులు డైలమాలో ఉన్నారు. అనుచరులు మాత్రం అభ్యర్థుల్లో నమ్మకం కలిగిస్తూ మందు, విందులు చేసుకుంటున్నారు.
రాయబేరాలు


