ఎందుకీ శాపం!
రక్షణ చర్యలేవి?
ఎవరిదీ పాపం
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
ఉమ్మడి జిల్లాలో రహదారులు మృత్యుకుహరాలుగా మారాయి. తరచూ ప్రమాదాలు జరిగి ఎందరో మృత్యువాత పడుతున్నారు. ప్రమాదం అంటే రెండు వాహనాలు ఢీకొట్టుకోవడం కాదు.. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడటం. తాజాగా చేవెళ్లలో టిప్పర్ లారీ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో పదుల సంఖ్యలో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. మితిమీరిన వేగంతోపాటు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకులు అసువులుబాసారు. మరోవైపు ఇసుక, గ్రానైట్ లోడ్లతో తిరిగే వాహనాలతో మనకూ ముప్పు పొంచి ఉంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించినప్పటికీ.. సరైన ప్రమాద హెచ్చరిక బోర్డులు, వాటి నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల మనకూ అదేస్థాయిలో ముప్పు పొంచి ఉంది.
కరీంనగరే టాప్..
ఉమ్మడి జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాల్లోకరీంనగర్ జిల్లా టాప్‌లో ఉంది. ఇక్కడ మొత్తంగా 624 ప్రమాదాలు జరగగా 164 మంది మరణించారు. 576 మంది క్షతగాత్రులయ్యారు. తరువాతి స్థానంలో జగిత్యాల ఉంది. ఇక్కడ 402 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 150 మంది అసువులు బాసారు. 413 మంది గాయపడ్డారు. పెద్దపల్లిలో 245 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 75 మంది మరణించారు. 204 మంది గాయాలతో బయటపడ్డారు. సిరిసిల్ల రోడ్డు ప్రమాదాల్లో మూడోస్థానంలో నిలిచినా.. 67 మరణాలు, 257 క్షతగాత్రులతో నాలుగోస్థానంలో నిలిచింది. కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్–కరీంనగర్, వరంగల్, జగిత్యాల రహదారుల్లో ఇప్పటి వరకు గుర్తించిన పలు బ్లాక్ స్పాట్లను నిరోధించడంలో పోలీసులు, ఆర్‌అండ్‌బీ అధికారులు పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేకపోయారు. ఫలితంగా ఇంకా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, డ్రంకెన్‌డ్రైవ్ కూడా కొన్నిసార్లు కారణాలు అవుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ నగరంలోని అనేక జంక్షన్ల నిర్మాణంలో లోపాల కారణంగా నేటికీ అమాయకుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలైన పెద్దపల్లి, కరీంనగర్‌లో అత్యధికంగా గూడ్స్ వాహనాలు తిరుగుతుంటాయి. ముఖ్యంగా పెద్దపల్లిలో బొగ్గులోడులతోపాటు, గోదావరి, మానేరుల నుంచి నడిచే ఇసుక లారీలు, కుందనపల్లి నుంచి నడుస్తున్న బూడిద లారీల్లో కొన్ని ఓవర్ లోడ్‌తో వెళ్తున్నాయి. ఇవన్నీ భారీ వాహనాలే. నిత్యం వందలాది వాహనాలు మంథని, కరీంనగర్, హైదరాబాద్, మంచిర్యాల రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కరీంనగర్‌లో గ్రానైట్ పరిశ్రమ అతిపెద్దది. ఇక్కడ కరీంనగర్, ఉప్పల్, జమ్మికుంట, జగిత్యాల తదితర రైల్వేస్టేషన్లకు తరలించే భారీ గ్రానైట్ రాళ్లకు ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోవడం లేదు. వీటి ఓవర్‌లోడ్ కారణంగా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. తరచూ ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి.


