
ధాన్యం ఆరబోసేందుకు స్థలమివ్వాలని..
● బైపాస్ రోడ్డును ఒకవైపు మూసివేసి రైతుల నిరసన ● మూసివేయడం కుదరదన్న పోలీసులు
సిరిసిల్ల అర్బన్: ధాన్యం ఆరబెట్టుకునేందుకు బైపాస్‌రోడ్డుపై స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. రగుడు–వెంకటాపూర్ రెండో బైపాస్‌రోడ్డుకు ఒకవైపు టైర్లు వేసి దారి మళ్లించడం జరిగిందని ఫ్లెక్సీ కట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రోడ్డుకు అడ్డుగా వేసిన టైర్లు, ఫ్లెక్సీలను తొలగించారు. రోడ్డును మూసివేయడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణ పరిధిలోని విలీన గ్రామాలైన రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, పెద్ద బోనాల, చిన్నబోనాల, పెద్దూరు, సర్ధాపూర్ గ్రామాలకు చెందిన రైతులు ఏటా పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సరైన స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరికోతలు ప్రారంభమైనందున ధాన్యాన్ని ఎక్కడ ఆరబెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉందని అధికారులకు పలుసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన గ్రామాల, వెంకటాపూర్ రైతులు శుక్రవారం కలెక్టర్‌ను కలిసేందుకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మా జీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు, మాజీ ఎంపీటీసీ బుర్ర మల్లికార్జున్, రైతులు పాల్గొన్నారు.