
సీపీఆర్‌పై అవగాహన ఉండాలి
● అదనపు కలెక్టర్ నగేశ్ ● కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బందికి అవగాహన
సిరిసిల్ల: సీపీఆర్(కార్డియో పల్మనరీ రిసోసియేషన్)పై అందరికీ అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పేర్కొన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌లో బుధవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ సీపీఆర్ చేసి మాట్లాడారు. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు అయినప్పుడు సీపీఆర్ చేసి ప్రమాదం నుంచి కాపాడగలుగుతామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగార్జున మాట్లాడుతూ కార్డియాక్ అరెస్టు అయితే 108 అంబులెన్స్‌కు సమాచారమిస్తూనే వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తూ ఊపిరి అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చన్నారు. గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, మెదడు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడిన వెంటనే సహాయం అందించకపోతే మెదడు దెబ్బతినడం, నిమిషాల్లో మరణం సంభవిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, వైద్యులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.