పత్తాలేని రైతు కల్లాలు
రోడ్లపైనే ధాన్యం ఆరబెడుతున్న రైతులు
ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు, అన్నదాతలు
పట్టించుకోని అధికారులు, పాలకులు
ప్రతీ సీజన్‌లో ఇదే తంతు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ధాన్యం అమ్ముకునేంఉదకు రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం రావడానికి స్థలాలు లేక ప్రధాన రహదారుల వెంట ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు జరిగి రైతులు, వాహనదారులు గాయాలతో బయటపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మండలవ్యాప్తంగా 25 కొనుగోలు కేంద్రాలు ఉండగా, కేవలం 15 కేంద్రాలకు మాత్రమే స్థలాలు ఉన్నాయి. నిర్వహకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులు అమ్ముకోవడానికి సరైన ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఒకటి అర తప్ప ఇప్పటి వరకు కల్లాలు ఏర్పాటు కాలేదు. దీనిపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.
కాగితాలకే పరిమితం
రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన కల్లాల ఏర్పాటు ప్రక్రియ కాగితాలకే పరిమితమైంది. జిల్లా వ్యాప్తంగా రెండంకెల లోపే అసంపూర్తిగా కల్లాలు ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా 24 గ్రామపంచాయతీల పరిధిలో 10లోపే కల్లాలు ఏర్పాటు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో రోజుల తరబడి రహదారులపైనే అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.
వెంటాడుతున్న ప్రమాదాలు
ప్రధానంగా సిరిసిల్ల–కామారెడ్డి, ఎల్లారెడ్డిపేట–వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట–గంభీరావుపేట రహదారుల్లో రైతులు నిత్యం ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. కేంద్రాలకు స్థలాలను సమకూర్చకపోవడంతో రోడ్లపైనే ఆరబెట్టే దుస్థితి ఏర్పడుతోంది. ఈనేపథ్యంలో గత రెండు సీజన్‌లలో నాలుగు ప్రమాదాలు జరిగి 8మంది రైతులు తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డారు. గోరింట్యాల, వీర్నపల్లి, హరిదాస్‌నగర్, వెంకటాపూర్, వేములవాడ, తంగళపల్లి శివారులో ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా రాత్రిపూట రైతులు ధాన్యం రాశుల వద్ద కాపలా ఉండే క్రమంలో నిద్రకు ఉపక్రమించడం, అదే సమయాల్లో వాహనాలపై వచ్చేవారికి ధాన్యం కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికై న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కేంద్రాలకు ప్రత్యేక స్థలాలను గుర్తించి అన్నదాతల ఇబ్బందులు తొలగించాలని రైతులు కోరుతున్నారు.
‘ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో
సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారు. చీకటి పూట ధాన్యం రాశులు కనిపించక వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో ఇదే రహదారిపై ధాన్యానికి కాపాలాగా ఉన్న రైతు మల్లయ్య ద్విచక్రవాహనం ఢీకొని కోమాలోకి వెళ్లాడు. ఇలా రోడ్లపై ఆరబెట్టిన ధాన్యంతో రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు’.
‘ఈ రైతు పేరు దేవరాజు, గ్రామం దుమాల. ధాన్యం ఆరబెట్టడానికి రోడ్డెక్కాడు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ధాన్యాన్ని ఆరబెట్టి అమ్ముకునేందుకు సౌకర్యాలు కల్పించడం లేదు. దీంతో రైతులు దారులపైనే ధాన్యం ఆరబెట్టి అక్కడే అమ్ముకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు వెంట వెళ్లే వాహనాలతో ప్రమాదాలకు గురైన సంఘటనలున్నాయి. ప్రతి సీజన్‌లో భయంభయంగా రోడ్డుపై ధాన్యం ఆరబెట్టి అమ్ముకుంటున్నామని దేవరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఇతడొక్కడి పరిస్థితే కాదు.. మండలంలో అనేక ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇలాంటి పాట్లు పరిపాటిగా మారాయి’.
దారులపై ధాన్యం