
అలసిన అరుణ కిరణం
జనజీవన స్రవంతిలోకి మల్లోజుల
ప్రభుత్వం ఎదుట లొంగిపోయిన సోను
మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ
భూమి.. భుక్తి.. పీడిత, తాడితుల విముక్తి కోసం ఆయుధం పట్టి సుమారు నాలుగు దశాబ్దాల పాటు పాలకులపై తిరగుబావుటా ఎగురవేసిన అరుణ కిరణం అలసిపోయింది.. వృద్ధాప్యం, మారుతున్న కాలం, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో నూనూగుమీసం బందూకును వీడింది.. బ్రాహ్మణ సామాజికవర్గంలో జన్మించినా దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించింది.. చరిత్రలోనే తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన అప్పటి పీపుల్స్‌వార్, ప్రస్తుత మావోయిస్ట్(సీపీఐ–ఎంఎల్) పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు ఉరఫ్ భూపతి, అభయ్, మాస్టర్, ఉరఫ్ సోన్ జనజీవన స్రవంతిలోకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. స్వాతంత్య్ర సమరయోధుడు, తండ్రి మల్లోజుల వెంకటయ్య, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, సోదరుడు మల్లోజు కోటేశ్వర్‌రావు ఆశయాలను పుణికి పుచ్చుకున్న అభయ్.. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా శత్రువులను ముప్పుతిప్పలు పెట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. దండకారణ్యంలో ఒకానొకదశలో సంమాంత ప్రభుత్వం నడిపినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమానికి విరామం ప్రకటిస్తున్నామంటూ కొంతకాలంగా లేఖలు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే సోనూ లొంగిపోయినట్లు సమాచారం.
– సాక్షి, పెద్దపల్లి

అలసిన అరుణ కిరణం