
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు మండల సర్వేయర్ లంచం తీసుకుంటూ మంగళవారం పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ పి.విజ య్‌కుమార్ కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణానికి చెందిన బాధితుడికి పట్టణ శివారులోని చిన్నబోనాల వద్ద మూడెకరాల భూమి ఉంది. ఆ భూమి హద్దులను సర్వే చేసేందుకు నిబంధనల మేరకు రెవెన్యూ శాఖకు ఫీజు చెల్లించాడు. కాగా, రూ.30వేలు లంచం ఇస్తేనే సర్వే చేస్తానని మండల సర్వేయర్ మాడిశెట్టి వేణుగోపాల్ స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు చేసేది లేక సోమవారం రూ.10వేలు అప్పగించడంతో సర్వేయర్ చిన్నబోనాలకు వెళ్లి భూసర్వే చేశాడు. సర్వేకు సంబంధించి పంచనామా నివేదికను బాధితుడికి ఇచ్చేందుకు ఒప్పందంలో భాగంగా మరో రూ.20వేలు డిమాండ్ చేశాడు. అప్పటికే ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు.. వారి సూచన మేరకు డబ్బు ఇచ్చేందుకు సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్‌కు వచ్చాడు. డబ్బులను ఆఫీస్‌లో కాకుండా తన వద్ద ప్రైవేటు సహాయకుడిగా పని చేసే సూర్యవంశీకి ఇవ్వాలని సర్వేయర్ సూచించాడు. ఆయన సూచన మేరకు సూర్యవంశీకి రూ.20వేలు ఇవ్వడంతో ఏసీబీ పోలీసులు పట్టుకున్నారు. సహాయకుడు, సర్వేయర్‌ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా ఏసీబీ అధికాలను ఆశ్రయించాలని ఆయన కోరారు.