చేపపిల్లల పంపిణీపై సందిగ్ధత | - | Sakshi
Sakshi News home page

చేపపిల్లల పంపిణీపై సందిగ్ధత

Sep 15 2025 7:53 AM | Updated on Sep 15 2025 7:53 AM

చేపపిల్లల పంపిణీపై సందిగ్ధత

చేపపిల్లల పంపిణీపై సందిగ్ధత

టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు

నేడు టెండర్లు ఓపెన్‌

తొలిసారి మల్కపేట రిజర్వాయర్‌లోకి చేప పిల్లలు

జిల్లాలో 1.48 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యం

అదును దాటుతోందని మత్స్యకారుల ఆందోళన

బోయినపల్లి(చొప్పదండి): మత్స్యకారులకు ఉపాధి అందించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ఉచితంగా చేపపిల్లల పంపిణీని చేపట్టింది. ఈ సంవత్సరం చేపపిల్లల పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా ఇంకా టెండర్లు కూడా ఖరారు కాలేదు. గతేడాది సైతం ఆలస్యంగా అక్టోబర్‌ నెలాఖరులో పంపిణీ చేశారు. ఈ సారి కూడా అదే తంతు కొనసాగుతోంది. అదును దాటిన తర్వాత చెరువుల్లో చేపపిల్లలు వదిలితే అనుకున్న స్థాయిలో ఎదుగవని మత్స్యకారులు పేర్కొంటున్నారు.

ఈసారి కొత్తగా మల్కపేటలోకి..

బోయినపల్లి మండలంలోని మిడ్‌మానేరు, గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు, ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ ప్రాజెక్టుల్లో ఏటా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదులుతున్నారు. అయితే ఈ సంవత్సరం కొత్తగా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌లో చేపపిల్లలు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ఉన్న నీటి వనరుల్లో 1.48 కోట్ల చేపపిల్లలు వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఇటీవల టెండర్లు దాఖలు చేయగా, వాటిని ఈనెల 15న తెరువనున్నారు.

మిడ్‌మానేరులో అత్యధికం

జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులతోపాటు సుమారు 452 చెరువుల్లో 1.48కోట్ల మేర చేపపిల్లలు పంపిణీ చేయాలని ప్రభుత్వం టెండర్లు పిలిచింది. బొచ్చె, రవు, మోస్‌, బంగారు తీగలు చేపపిల్లల రకాలు ఉన్నాయి. మిడ్‌మానేరులో 28.50 లక్షలు, ఎగువమానేరులో 10.50, అన్నపూర్ణలో 13.69, మల్కపేటలో 7.49 లక్షల చేపపిల్లలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 44 పెరీనియల్‌ ట్యాంకుల్లో 20 లక్షలు, 408 సీజనల్‌ ట్యాంకుల్లో 68.45 లక్షలు చేపపిల్లలు వదలనున్నారు. నాలుగు ప్రాజెక్టుల్లో 80–100 ఎంఎం నుంచి 79–69 ఎంఎం, చెరువుల్లో 35–40 ఎంఎం నుంచి 68–45 ఎంఎం సైజ్‌లో ఉన్న చేప పిల్లలు వదలనున్నారు.

జిల్లాలో మత్స్యశాఖ స్వరూపం

మత్స్యకార్మిక సంఘాలు : 168

మత్స్యకారులు : 9,526

ప్రధాన జలాశయాలు: మిడ్‌మానేరు, అప్పర్‌ మానేరు, అన్నపూర్ణ, మల్కపేట

చెరువులు, కుంటలు : 452

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement