
మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలో తన నివాసంలో ఆదివారం పలువురు మహిళలు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఇందిరా మహిళాశక్తి పథకాన్ని ప్రారంభించారన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మేలు జరిగితే మళ్లీ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెట్టపీట వేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దెబస్సులు, పెట్రోల్ పంపు, ధాన్యం కొనుగోలు, రైస్‌మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందిరా మహిళాశక్తిలో భాగంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలని మైక్రో ఎంటర్‌ప్రజేస్, మహిళా శక్తి స్టిచ్చింగ్ సెంటర్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ యూనిట్, సోలార్ పవర్‌ప్లాంట్, డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేసి, బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోన్‌బీమా, ప్రమాదబీమా పథకాలతో ఎందరికో ప్రయోజనం చేకూరుతుందన్నారు.