
మెరుగైన విద్య అందించడమే లక్ష్యం
● అగ్రహారం డిగ్రీ కళాశాలలో మహిళా వసతిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం పీఎం ఉషా పథకం కింద రూ.9.20కోట్లతో మహిళా వసతి గృహ భవనం నిర్మాణానికి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం హాస్టల్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో అగ్రహారం డిగ్రీ కళాశాలలో సైన్స్ వింగ్ ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. హాస్టల్ వసతి అందుబాటులోకి వస్తే ఎక్కువ మంది బాలికలు ఉన్నత చదువులు చదువుకుంటారన్నారు. పేదపిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో కామన్ డైట్ మెనూ ప్రవేశ పెట్టామన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ 18 నెలల్లో హాస్టల్ భవనం పూర్తి చేసి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.