
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు
● విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): నిరుపేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీక అని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝాతో కలిసి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని చెప్పడానికి చందుర్తి మండలంలోని 19 గ్రామాలకు 520 ఇళ్లు మంజూరు చేశామని, పైలట్ ప్రాజెక్టు గ్రామం కొత్తపేటలో 17 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, లబ్ధిదారులు నాలుగునెలల లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, విండో అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి రవీందర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా మండలంలోని రామన్నపేటలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. వేములవాడ పట్టణంలో బిల్డింగ్ ఉన్న వ్యక్తిని లబ్ధిదారుగా ఎంపిక చేశారని, ఇప్పటికై నా అనర్హులను గుర్తించి, అర్హులకు అండగా నిలవాలని కోరారు.
ఈదురుగాలుల వర్షం.. విరిగిన స్తంభం
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మండలకేంద్రంలో ఎమ్మార్సీ ఏరి యాలో ఓ విద్యుత్ స్తంభం విరిగి ఇంటిపై పడింది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.