
దీపావళి సొంతింటిలో జరుపుకోవాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరుపత్రాలు పంపిణీ
తంగళ్లపల్లి/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వచ్చే దీపావళి తమ సొంతిళ్లలో జరుపుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి మంజూరుపత్రాలు పంపిణీ చేశారు. తంగళ్లపల్లి మండలంలో 500, ఎల్లారెడ్డిపేట మండలంలో 643 మంది లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు దశలలో రూ.5లక్షలు అందజేస్తామని తెలిపారు. బేస్‌మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడలు నిర్మిస్తే రూ.లక్ష, స్లాబ్ తరువాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత చివరి రూ.లక్ష నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వివరించారు. బిల్లుల విషయంలో దళారులను నమ్మొద్దని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. 30 రోజుల్లోగా ఇంటి పనులు ప్రారంభించాలని, లేకుంటే అనుమతులు రద్దవుతాయన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేద మహిళలకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామన్నారు. పీడీ హౌసింగ్ శంకర్, మండలాల ప్రత్యేకాధికారులు షరీఫుద్ధీన్, అఫ్జల్‌బేగం, ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూప, సాబేర బేగం, వైస్‌చైర్మన్ నేరెళ్ల నర్సింగం, ఎల్లారెడ్డిపేట పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, తహసీల్దార్‌లు జయంత్‌కుమార్, సుజాత, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ప్రవీణ్ జే టోని, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో సత్తయ్య, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.