
రాతిచూర.. పట్టించుకోరా?
● విచ్చలవిడిగా గ్రానైట్ డస్ట్ కుప్పలు ● ప్రయాణికుల తిప్పలు ● పరిధి పేరుతో పట్టించుకోని అధికారులు
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో వెంకట్రావుపల్లి ఫోర్‌లేన్ రోడ్డు పరిసరాలు, కొత్తపేటలో విచ్చలవిడిగా గ్రానైట్ వ్యర్థాలు (డస్ట్) డంపింగ్ చేయడంతో గాలికి డస్ట్ లేచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట, గంగాధర మండలం ఒద్యారం గ్రానైట్ ఫ్యాక్టరీలనుంచి నిత్యం గ్రానైట్ కటింగ్ రాళ్ల డస్ట్ ఫోర్‌లేన్ రహదారికి ఇరువైపులా డంప్ చేస్తున్నారు. ఈ రహదారి మీదుగా నిత్యం వందల మంది ప్రయాణాలు చేస్తున్నారు. గాలికి డస్ట్ లేచి వాహనదారుల కళ్లలో పడుతుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు.
విచ్చలవిడిగా డంపింగ్
మండలంలోని వెంకట్రావుపల్లి, కరీంనగర్ వెళ్లే దారిలో బావుపేట, ఒద్యారం గ్రామాల్లో పెద్ద మొత్తంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పెద్ద రంపంతో ఉన్న మిషన్‌తో రాళ్లు కట్ చేసి స్లాబ్స్ తయారు చేస్తారు. ఈక్రమంలో తెల్లని ద్రవంరూపంలో డస్ట్ బయటకు వస్తుంది. కొన్ని ఫ్యాక్టరీలు ఆ ద్రవాన్ని స్టోర్ చేసి, పొడిగా మారిన తర్వాత విక్రయిస్తాయి. మరకొన్ని ఫ్యాక్టరీల నుంచి కొందరు డస్ట్‌ను తీసుకువచ్చి అక్రమంగా వెంకట్రావుపల్లి రోడ్డు పరిసరాల్లో పోస్తున్నారు. దీంతో ఈదురుగాలులు వీచినపుడు వాహనదారుల కళ్లలో డస్ట్ పడి ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల పరిధి ఏది..?
బావుపేట, ఒద్యారం, వెంకట్రావుపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీలు సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల సరిహద్దు గ్రామాల్లో ఉండడంతో మైనింగ్, ఆర్‌అండ్‌బీ అధికారులు తమ జిల్లా పరిధి కాదని, గ్రానైట్ వ్యర్థాల డంపింగ్‌పై చర్యలకు దాటవేస్తున్నారని పలువురు అంటున్నారు. కరీంనగర్, సిరిసిల్ల రెండు జిల్లాల మైనింగ్, ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయంతో గ్రానైట్ వ్యర్థాల నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

రాతిచూర.. పట్టించుకోరా?

రాతిచూర.. పట్టించుకోరా?