● తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు ● వారసులకు ఉద్యోగాలు ● జిల్లాలో అక్రమంగా నియామకాలు ● వరుసగా వెలుగుచూస్తున్న మోసాలు
సిరిసిల్ల: కొందరు ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌కు ఆరేడేళ్ల ముందు మాయదారి రోగాలు వస్తున్నాయి. అప్పటి వరకు ఠంఛన్‌గా విధులకు హాజరైన వారు ఇక అక్కడి నుంచి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్తూ వివిధ రకాలు చికిత్సలు పొందుతున్నారు. కాదు..కాదు.. చికిత్స పొందినట్లు మెడికల్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. చదవండి మీకే తెలుస్తుంది. అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ తాము పనిచేయలేమని తమ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది జిల్లాలోని కొందరు ఉద్యోగులకు అంటుకున్న అసలు మాయదారి రోగం. ఇప్పటి వరకు ఇలా చాలా మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో తమ వారసులను ప్రభుత్వ ఉద్యోగులుగా కూర్చోబెట్టారు. లేని రోగాలను తెచ్చుకుని, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లను ‘కొని’తెచ్చుకున్న వైనాలు జిల్లాలో కొన్ని వెలుగులోకి రాగ.. అనేక సంఘటనలు ఇంకా మరుగునపడి ఉన్నాయి. జిల్లాలో సాగుతున్న అక్రమాలపై ప్రత్యేక కథనం.
ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసు(రిటైర్‌మెంట్ గడువు) ఇంకా ఆరు, ఏడు ఏళ్లు ఉందనగా.. దీర్ఘకాలిక సెలవులోకి వెళ్తారు. మెడికల్ లీవ్ పెడతారు. తరువాత కొన్ని నెలలపాటు అనారోగ్య సమస్యలు చూపుతూ వివిధ చికిత్సలు పొందినట్లు, ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించుకుని, మందులు వాడినట్లు రికార్డులు సృష్టిస్తారు. ఆ మెడికల్ రిపోర్టులకు బలాన్నిచ్చేలా హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద ఆస్పత్రులకు, ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలు పొందినట్లుగా మరిన్ని సర్టిఫికెట్లు సాధించుకుంటారు. వీటిని ఆసరా చేసుకుని, ఇక తాము ఉద్యోగం చేసేందుకు అనర్హులమని, అనారోగ్య సమస్యలతో విధులు చేయలేమని అర్జీ పెట్టుకుంటారు. మానవతా దృక్పథంతో తమ వారసులకు ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటారు. వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన ఉద్యోగుల వారసులకు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అధికారం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీకి ఉంటుంది. ఈ కమిటీలో ఆయా ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, డీఎంహెచ్‌వో, ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షకులతో కూడిన కమిటీ ఉంటుంది. ఈ కమిటీ పర్యవేక్షణలో అర్జీ పెట్టుకున్న ఉద్యోగి పనిచేయలేని స్థితిలో ఉన్నారా.. అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అది నిజమే అయితే కమిటీ సిపార్సు మేరకు కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సదరు ఉద్యోగి వారసులకు ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. ప్రభుత్వ జీవో ఆధారంగా అనేక మంది ఇలా వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకున్నారు.
‘సెస్’లో ఏం జరుగుతోంది..!?
జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ఉద్యోగులు తమ పిల్లలకు వారసత్వంగా ఉద్యోగాలను ఇప్పించే విధానం లేదు. ‘సెస్’లో పనిచేసే ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఉంటాయి. కానీ ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్ ఉండదు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ఉద్యోగులు ‘సెస్’ పాలకవర్గం అండదండలతో అక్రమ విధానంలో ఉద్యోగాలు పొందారు. ‘మాయదారి’ రోగాలను ‘కొని’తెచ్చుకుని ‘సెస్’ ఉన్నతాధికారులను, మెడికల్‌బోర్డు సభ్యులను డబ్బులతో కొనేసి తప్పుడు ధ్రువీకరణపత్రాలతో తండ్రి ఉద్యోగాన్ని వారసత్వంగా మెడికల్‌గ్రౌండ్స్(అనారోగ్య సమస్యలతో) సాధించుకున్నారు. ‘సెస్’లో వారసత్వ ఉద్యోగాలు సాధించుకున్న కొందరు నిజంగానే మెడికల్ అన్‌ఫిట్ కావడంతో ఉద్యోగాల్లో చేరగా.. అనేక మంది మాత్రం అన్నీ సవ్యంగా ఉన్నా.. అక్రమ పద్ధతుల్లో ‘సెస్’లో ఉద్యోగాలు సాధించి రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్నారు. జిల్లా పరిధిలోనే జీవితకాలం ఉద్యోగం కావడంతో కడుపులో చల్లకదలకుండా ‘సెస్’ పరిధిలో ఉద్యోగాలు చేస్తున్నారు. వచ్చే 11 ఏళ్లకు సరిపోయేంత మంది వారసులు వివిధ ఖాళీ పోస్టుల్లో ఉద్యోగులుగా చేరిపోయారు. ‘సెస్’ డైరెక్టర్లు, ఉన్నతాధికారుల అండదండలతో అక్రమమార్గంలో విధుల్లో చేరారు. ఏ విచారణ లేకుండా దర్జాగా డ్యూటీ చేస్తున్నారు.
తనిఖీలు లేకుండానే ఉద్యోగాలు..?
జిల్లాలో దశాబ్దకాలంగా ‘సెస్’తోపాటు, రెవెన్యూ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ ఇలా అన్ని ప్రభుత్వ శాఖల్లో మెడికల్ ఇన్‌వాలిడేషన్ గ్రౌండ్స్‌లో ఉద్యోగాలు పొందిన వారిపై ఎలాంటి విచారణ లేకపోవడంతో ఏళ్లుగా ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు. కొందరైతే నకిలీ విద్యార్హతల(బోగస్) సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది.. ప్రమోషన్లు పొందినట్లు సమాచారం. ఏది ఏమైనా ‘సెస్’ లాంటి సంస్థతోపాటు ప్రభుత్వ శాఖల్లో తండ్రి ఉద్యోగాన్ని పొందిన వారిపై విచారణ చేపడితే పశువైద్యశాఖ తరహాలో తప్పుడు ధ్రువీకరణపత్రాల భాగోతాలు బయటపడనున్నాయి.
ఇటీవల వెలుగుచూసిన ఘటనలు
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి పశువైద్యశాలలో పనిచేస్తున్న కొమురయ్య తాను పనిచేయలేని స్థితిలో ఉన్నానని తన కొడుకుకు ఉద్యోగం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు ఏడు నెలల కిందట మెడికల్ ధ్రువీకరణపత్రాలతో అర్జీ పెట్టుకున్నాడు. దీనిపై జిల్లా స్థాయి కమిటీ పరిశీలించింది. అధికారుల పరిశీలనలో మెడికల్ సర్టిఫికెట్లు తప్పుగా ఉన్నట్లు అనుమానించారు. దీంతో కలెక్టర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించారు. కొమురయ్య సమర్పించిన వైద్యుల ధ్రువీకరణపత్రాల ఆధారంగా చేపట్టిన రహస్య విచారణలో ఆ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులు, వారి మెడికల్ సర్టిఫికెట్లు, ఆస్పత్రి లోగో, ఐఎంఏలో వైద్యుల వివరాలు అన్నీ తప్పుడు పత్రాలుగా నిర్ధారణ అయింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్, కొమురయ్యపై పోలీసు కేసు నమోదు చేయించారు.
ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పశువైద్యశాలలో అటెండర్‌గా పనిచేసే కె.దేవమ్మ 2024 జూన్ 1న మెడికల్ ఇన్‌వాలిడేషన్‌కు తప్పుడు ధ్రువీకరణపత్రాలతో దరఖాస్తు చేయగా.. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. కరీంనగర్‌కు చెందిన డాక్టర్ జి.కిరణ్ ఏడీ, డీఎం(గ్యాస్టో) డాక్టర్ రవికుమార్, పి.శరత్‌రెడ్డి వద్ద వైద్యపరీక్షలు చేయించుకున్నట్లుగా, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నట్లుగా తప్పు డు పత్రాలను సమర్పించినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేవమ్మను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
దరఖాస్తులు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వడం లేదు
మెడికల్ ఇన్‌వాలిడేషన్ గ్రౌండ్స్‌లో ఒకటి, రెండు దరఖాస్తులు వచ్చాయి. కానీ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగులు చనిపోయిన ఘటనల్లో ఐదు కారుణ్య నియామకాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. మెడికల్ గ్రౌండ్స్‌లో గతంలో ఏం జరిగిందో మా పాలకవర్గానికి సంబంధం లేదు. ఇప్పుడైతే ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవ్వం కూడా.
– చిక్కాల రామారావు,
‘సెస్’ చైర్మన్, సిరిసిల్ల,
‘మాయదారి’ రోగాలు !
‘మాయదారి’ రోగాలు !
‘మాయదారి’ రోగాలు !
‘మాయదారి’ రోగాలు !