సిరిసిల్లటౌన్: పార్టీలో గ్రూప్ రాజకీయాలు వద్దు..చేస్తే నేను సహించ.. ఇదే నా హెచ్చరిక అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. సిరిసిల్లలోని మున్నూరుకాపు సంఘంలో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనది బీజేపీ వర్గమని, నరేంద్రమోదీ గ్రూపుగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం పనిచేస్తే.. అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి ఓటమికి కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేశారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడు బీజేపీ నేతలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజలపై కేసులు పెట్టించారన్నారు. సెస్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంటే అప్పటి మంత్రి కేటీఆర్ అధికారులను బెదిరించి ఫలితాలు తారుమారు చేయించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు అర్బన్ నక్సల్స్ కన్నా డేంజర్ అంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పల్లెలకు అందించిన నిధులపై విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై ప్రజలు కోపంతో ఉన్నారని.. ఈ తరుణంలో పార్టీకి నష్టం పరిచేలా ఎవరూ ప్రవర్తించినా సహించబోమన్నారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒక్కటై ఢిల్లీలో చీకటి పొత్తు కుదుర్చుకున్నాయన్నారు. కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాలకు నిధుల్లేవంటూనే మంత్రుల బినామీలైన కాంట్రాక్టర్లకు బిల్లులు ముట్టజెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమల దళంలో ఉత్సాహం
జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హాజరవడం కమల దళంలో ఉత్సాహాన్ని నింపింది. స్థానిక కల్టెరేట్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బైక్‌ర్యాలీగా తరలివచ్చారు. అభిమానులు బండి సంజయ్ తోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమానికి వేములవాడ, సిరిసిల్ల నియోజవర్గల్లోని బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ రాష్ర నాయకుడు మేర్గు హన్మంతు, వేములవాడ ఇన్‌చార్జి చెన్నమనేని వికాస్‌రావు, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పొట్టి శ్రీరాములుకు వ్యతిరేకి
బీజేపీలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
సిరిసిల్లలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం