● గేదైపె దాడి ● పాదముద్రలు గుర్తించిన రైతులు
వేములవాడరూరల్: వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్ ఫారెస్టు ప్రాంతంలో పులి సంచరిస్తున్న ఆనవాళ్లు బయటపడ్డాయి. ఫాజుల్‌నగర్ శివారులో ఓ గేదైపె పులి దాడిచేసిన ఆనవాళ్లు, దాని పాదముద్రలు రైతులు గుర్తించారు. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు రైతులకు సమాచారం వచ్చింది. ఫారెస్టు అధికారులు ఈ ప్రాంతంలో గాలిస్తున్నా పులి ఆనవాళ్లు గుర్తించలేదు. రెండు రోజుల క్రితం ఫాజుల్‌నగర్‌కు చెందిన ఉప్పరి నారాయణ అనే రైతు గేదైపె పులి దాడిచేయడం, దాని పాదముద్రలు బయటపడడంతో పులి తిరుగుతున్నట్లు రైతులు గుర్తించారు. దీంతో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఫారెస్టు అధికారులు పులి తిరుగుతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫాజుల్‌నగర్, నూకలమర్రి, నమిలిగుండుపల్లి, వట్టెంల ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎఫ్‌ఆర్‌వో ఖలీలొద్దీన్‌ను వివరణ కోరగా పూర్తి సమాచారం రేపటి వరకు చెబుతామని దాటవేశారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
● సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య
సిరిసిల్లటౌన్: ఎల్‌ఆర్‌ఎస్‌కు 2020లో రూ.వేయి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు 25 శాతం రాయితీలో ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎస్.సమ్మయ్య తెలిపారు. ఈమేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.