
సిరిసిల్ల: అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ పథకాల అమలులో తొమ్మిదేళ్లలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, జిల్లాను దేశానికి దిక్సూచిగా నిలిపామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన జాతీయ సమైక్యత, సమగ్ర వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, ప్రజాసంక్షేమం, ఐటీ వరకు అన్ని రంగాల్లో దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. ప్రభుత్వ వైద్యరంగం నాడు ధీన స్థితిలో ఉండేదని.. నేడు పేదలకు ధైర్యమిస్తుందని పేర్కొన్నారు. ఆనాడు ఐదు మెడికల్ కాలేజీలుంటే.. నేడు 26 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు లక్ష్యంగా, 33 నర్సింగ్ కాలేజీలతో ముందుకుసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
జిల్లాలో ప్రగతిబాటలు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగుజలాలు, భూగర్భ జలాల లభ్యత పెరగడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2016లో 1,77,960 ఎకరాలున్న సాగు విస్తీర్ణం నేడు 2,40,430 ఎకరాలకు పెరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ–9 మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. దీని ద్వారా జిల్లాలోని 96,150 ఎకరాలకు సాగునీరు అందనుందని వివరించారు. రైతుబంధులో 1.27 లక్షల మందికి ఇప్పటి వరకు రూ.1269 కోట్ల సాయం అందించామని, రూ.33 కోట్లతో 14 గోదాములను నిర్మించామని, రైతుభీమాతో 1923 రైతుకుటుంబాలకు రూ.96.15కోట్ల బీమా పరిహారంగా చెల్లించినట్లు వివరించారు. జిల్లాలోని పేదలకు 3,443 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,20,202 మందికి ఆసరా పింఛన్లు ప్రతి నెల రూ.26.51 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ‘కళ్యాణలక్ష్మి’లో 22,095 మందికి రూ.201.96 కోట్లు, షాదీ ముబారక్‌లో 1,017 మందికి రూ.9.01 కోట్ల సాయం అందించామన్నారు. దళితబంధులో 206 మందికి సాయం అందించినట్లు తెలిపారు. జిల్లాలోని బీసీ, ఎంబీసీలకు మొదటి విడతలో 600 మందికి రూ.లక్ష చొప్పున అందించినట్లు తెలిపారు.
విద్యతో భవితకు పునాది
ఐటీఐ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ వైద్యకళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ శిక్షణ–పరిశోధన కేంద్రంతో జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందన్నారు. నేతన్నలకు అండగా ఉండేందుకు రూ.2,500 కోట్లతో బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చామన్నారు. పెద్దూరు వద్ద 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో అపెరల్ పార్క్, 88 ఎకరాల్లో రూ.388 కోట్లతో వీవింగ్ పార్కులు ఏర్పాటైనట్లు చెప్పారు. రూ.4.50 కోట్లతో గోకుల్‌దాస్ ఇమేజెస్ పరిశ్రమ ఏర్పాటుతో 950 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని 8 వేల మంది మహిళలకు గార్మెంట్ రంగంలో ఉపాధి లభించనున్నట్లు వివరించారు. రైతుల మాదిరిగానే నేతన్నలకు బీమా ఇస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో జిల్లా అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉందన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, బి.గౌతమ్‌రెడ్డి, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి చైర్మన్ గడ్డం నర్సయ్య, ఆర్డీవోలు ఎన్.ఆనంద్‌కుమార్, మధుసూదన్, డీఆర్‌డీవో నక్క శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, జెడ్పీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, సీపీవో శ్రీనివాసాచారి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు ఉదయ్‌రెడ్డి, నాగేంద్రచారి, డీపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రసంగం మధ్యలో కరెంట్ కట్
కలెక్టరేట్‌లో వినోద్‌కుమార్ ప్రసంగిస్తుండగా మధ్యలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఐదు నిమిషాల పాటు అధికారులు హైరానా పడ్డారు. జనరేటర్ ఆన్ చేయడంలో వినోద్‌కుమార్ ప్రసంగాన్ని కొనసాగించారు. అంతకుముందు ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి కేటీఆర్ రావాల్సిన ఈ వేడుకలకు ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పాల్గొనడంతో చాలా మంది బీఆర్‌ఎస్ నాయకులు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. హడావుడి లేకుండానే వేడుకలు ముగిశాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ లేకుండానే.. ఎలాంటి తోపులాట.. నెట్టివేతలు లేకుండా వేడుకలు జరిగాయి. కలెక్టరేట్‌లో మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని వినోద్‌కుమార్ కోరారు.

జెండా వందనం చేస్తున్న వినోద్‌కుమార్, చైర్‌పర్సన్‌లు అరుణ, కళ, బీఆర్‌ఎస్ నాయకులు

వేడుకలకు హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు

పోలీసుల గౌరవ వందనం

మాట్లాడుతున్న బోయినపల్లి వినోద్‌కుమార్