● అక్రమంగా ఇంటి కూల్చివేతపై బాధితుడి ఫిర్యాదు బేఖాతరు
● గ్రీవెన్స్ అర్జీ మేరకు ఎస్పీ ఆదేశించినా కేసు కట్టని ఎస్సై
● మంత్రి స్వామి కనుసన్నల్లో బాధిత కుటుంబంపైనే ఎదురు కేసు
పొన్నలూరు: సామాన్య ప్రజలకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసులు దారి తప్పుతున్నారు. న్యాయం, అన్యాయం విచక్షించకుండా అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా సామాన్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బాధితుడి సమస్య పరిష్కరించాలని ఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు ఆదేశించినా స్థానిక ఎస్సై బేఖాతరు చేస్తున్న తీరు పొన్నలూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండలంలోని చెరుకూరుకు చెందిన కుంచాల మాధవరావు తనకు వారసత్వంగా వచ్చిన పక్కా గృహంలో 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు గ్రామంలో లేని సమయం చూసి, అదే గ్రామానికి చెందిన కుంచాల మాల్యాద్రి పొక్లెయిన్‌తో మాధవరావు ఇంటిని కూల్చివేసి ఆనవాళ్లు లేకుండా చదును చేశాడు. తన అర్హత పత్రాలతో న్యాయం చేయాలని శనివారం బాధితుడు పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా.. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎస్సై కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేసి వెనక్కి పంపారు. దీంతో బాధితుడు సోమవారం గ్రీవెన్స్‌లో ఎస్పీ ఎదుట సమస్యను మొరపెట్టుకున్నాడు. బాధితుని ఫిర్యాదుపై విచారించి కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయం ఆదేశించినా స్థానిక ఎస్సై పట్టించుకోలేదు. పోలీస్ బాస్ ఆదేశాలను సైతం పక్కనపెట్టి మంత్రి స్వామి కనుసన్నల్లో వింత నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే, ఇంటిని కూల్చిన మాల్యాద్రి వద్దనే సోమవారం ఎస్సై ఫిర్యాదు స్వీకరించారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ స్థలాన్నే వారు ఆక్రమించి, తమపై దౌర్జన్యం చేసినట్లు మాల్యాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాధితుడు మాధవరావు, అతని భార్య లక్ష్మి, బావ నరసింహంపై ఎస్సై అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం. మంత్రి స్వామి ఆదేశాలతోనే పోలీసులు ఈ విధంగా తమపై ఎదురు కేసు పెట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఇలా తప్పు చేసిన వారికి వత్తాసు పలుకుతూ సామాన్యులపై కేసులు బనాయించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై వివరణ కోరేందుకు ఎస్సైని ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సెంట్రల్ కమిటీ జాయింట్ సెక్రటరీగా ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి రేడియాలజీ విభాగం హెచ్‌ఓడి డా.నరసింహాచారి ఎన్నికకావడంపై జిల్లా ప్రభుత్వ వైద్యుల సంఘం (జీడీఏ) కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం డా.నరసింహాచారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఏడుకొండలరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు డా.నరసింహాచారి కృషి చేయాలని కోరారు. సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీడీఏ రాష్ట్ర కార్యదర్శి డా.నటరాజ్, గౌరవాధ్యక్షుడు డా.మస్తాన్ బాషా, గర్నింగ్‌బాడీ సభ్యులు డా.తిరుపతి రెడ్డి, డా.శ్రీదేవి పాల్గొన్నారు.


