ఒంగోలు సిటీ: జాతీయ స్థాయిలో నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో, రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ అక్రమాల ఆరోపణలు కూడా అంతే తీవ్రమైనవని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ లీకేజీలపై విద్యార్థులు చేసిన ఆందోళనకు కేంద్రం దిగి వచ్చిందన్నారు. ప్రధాని మోదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఎలాగైతే రాజీనామా చేయించారో అలాగే డీఎస్సీ అక్రమాలపై లోకేష్ చేత రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు బయటకు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటి వరకూ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. ‘‘డీఎస్సీలో ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి ప్రతి దానికీ ఆధారం, సాక్ష్యాలు ఉన్నాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు ఆధారాలను ప్రజల ముందు ఉంచారు. దీనిపై ఇప్పటి వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అంటూ మండిపడ్డారు.
విద్యార్థులతో కలసి భారీ ఉద్యమం
డీఎస్సీలో అక్రమాలు నిగ్గుతేల్చే వరకు వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని తెలిపారు. ఈ నెల 28వ తేదీన నిరుద్యోగ యువత, విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చదివిన అభ్యర్థుల కష్టం, వారి తల్లిదండ్రుల త్యాగం, కుటుంబాల ఆశలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రశ్నపత్రాల తయారీ బాధ్యత ఒక వ్యవస్థ వద్ద, పరీక్షల నిర్వహణ బాధ్యత మరో స్వతంత్ర వ్యవస్థ వద్ద ఉండాలి. కానీ రెండు కీలక బాధ్యతలను ఒకే అధికారి పరిధిలో ఎందుకు పెట్టారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, శాంతి భద్రతలు క్షీణించాయని, సాయికృష్ణ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే మానహక్కులు ఏమైపోయాయన్నారు. వీటన్నింటిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారని చెప్పారు. గిట్టుబాటు ధరలు లభించక రైతులకు జరుగుతున్న అన్యాయం, నిరుద్యోగ యువతకు భృతి కల్పించకపోవడం, యువతులకు రక్షణ లేకపోవడం, తల్లికి వందనం పథకంలో కోత ఇలా అన్ని అంశాలపై జగన్ ఉద్యమిస్తున్నారన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకూ అవసరమైతే కాక్రోచ్ తరహాలో ఉద్యమం చేస్తామన్నారు.


