నేడు పీటీఎం 4.0 నిర్వహణ గత మూడు సమావేశాలు రాజకీయ ఉపన్యాసాలకే పరిమితం ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,961 ప్రభుత్వ స్కూళ్లలో సమావేశాలు రూ.66.33 లక్షల నిధులు విడుదల ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని నిట్టూర్పు ప్రధానోపాధ్యాయులు, కుకింగ్ ఏజెన్సీలపైనా భారం ప్రభుత్వ ఆదేశాలతో వారం రోజులుగా ఉపాధ్యాయుల హడావిడి
ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు (పీటీఎం) విద్యాభివృద్ధికి వేదిక కావాల్సిందిపోయి ప్రచార కార్యక్రమాలుగా మారుతున్నాయి. పాఠశాలల సమస్యలు, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణపై చర్చించాల్సిన సమావేశాలు.. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలకే పరిమితమవుతున్నాయి. అరకొర నిధులతో ఏర్పాట్ల భారం ప్రధానోపాధ్యాయులపై పడుతుండగా, తల్లిదండ్రుల నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. దీంతో ఈ సమావేశాలతో విద్యా వ్యవస్థకు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది.
నిధులు మూరెడు..
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ మూడు దఫాలుగా మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లు నిర్వహించింది. 2024వ సంవసత్సరం డిసెంబర్ 7వ తేదీ, గతేడాది జూలై 10వ తేదీ, డిసెంబర్ 5వ తేదీ సమావేశాలు జరిపింది. వీటికి అటు విద్యార్థుల నుంచి ఇటు తల్లిదండ్రుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య పిల్లల విద్యాభివృద్ధి, అభ్యాస ఫలితాలు, పాఠశాల అవసరాలపై చర్చ జరగాల్సిన సమావేశానికి రాజకీయరంగు పులుముతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అరకొరగా నిధులు...
ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 2,961 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రకాశం జిల్లాలో 1,556, మార్కాపురం జిల్లాలో 1,405 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో మెగా పేరెంట్స్ మీటింగులు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమానికి మొత్తం రూ.66,33,450 నిధులు కేటాయించినప్పటికీ, అవి సరిపోవడం లేదని ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గతంలో జరిగిన సమావేశాల్లో చాలా ప్రాంతాల్లో ప్రధానోపాధ్యాయుల జేబులకు చిల్లులు పడ్డాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దఫా ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏ మాత్రం సరిపోవని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
వారం రోజులుగా సన్నాహక హడావిడి...
మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహణ కోసం వారం రోజులుగా ఉపాధ్యాయులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమవడంతో సాధారణ తరగతులకు అంతరాయం కలుగుతోంది. విద్యార్థుల బోధన సమయం తగ్గి సమావేశ ఏర్పాట్లకే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. గతంలో జరిగిన మూడు సమావేశాలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి స్పందన కరువైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారి హాజరు 30 శాతం కూడా దాటలేదు. గతంలో నిర్వహించిన సమావేశాలతో ఎలాంటి ఉపయోగం లేనప్పుడు శుక్రవారం జరిగే పీటీఎం 4.0 సమావేశాలు ఎందుకుని విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
భోజనం ఖర్చులు ఎలా..?
సమావేశాలకు హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనాలు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఒక మూలకు కూడా రావు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలకు పెట్టుబడి ఎక్కువ పెట్టుకోవాల్సి రావడంతో నిర్వాహకులు ఇబ్బందులుపడే అవకాశాలున్నాయి. గత మూడు సమావేశాల్లో జరిగిన తీరును చూసి నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన వ్యయాన్ని ఎలా భరించాలన్న ఆందోళన వారిలో నెలకొంది.
విద్యా చర్చలకే ప్రాధాన్యం ఇవ్వాలి...
తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాలు రాజకీయ ప్రచారానికి వేదిక కాకుండా చూడాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల అభ్యాసం, వ్యక్తిత్వ వికాసం, హాజరు, అభ్యాస లోపాలు, భవిష్యత్ లక్ష్యాలు వంటి అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్న ఆలోచనతోనే ఈ సమావేశాలు నిర్వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తల్లికి వందనం ప్రచారంపై వెనక్కి...
పీటీఎం సమావేశాల్లో తొలుత తల్లికి వందనం పథకాన్ని వివరించాలని భావించారు. విద్యార్థులతో పాటలు పాడించి నృత్యాలు చేయించాలని సూచించినట్టు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదువుకున్న విద్యార్థులందరికీ ఈ పథకం అందడంలేదు. రకరకాల కొర్రీలతో ఎగనామం పెడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చిస్తే విద్యార్థుల తలిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని భావించి చివరి నిమిషంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సమాచారం


