ఒంగోలు వన్‌టౌన్: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఉద్యోగాల నియామకాలలో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు సీహెచ్ సువార్త గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–4, తదితర విభాగాలకు చెందిన 42 బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. మెరిట్ జాబితాను ప్రకాశం.ఏపీ.జీఓవీ.ఇన్ అనే జిల్లా అధికారిక వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ పేరు, పోస్టు, దివ్యాంగుల కేటగిరి, విద్యార్హతలు, ఉద్యోగ సీనియార్టీ, మెరిట్ స్థానం, ఇతర వివరాలను పరిశీలించుకోవాలన్నారు. అభ్యంతరాలుంటే సంబంధిత ఆధార పత్రాలతో కూడిన తమ అభ్యంతరాలను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఒంగోలు ప్రకాశం భవన్‌లోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో స్వయంగాగానీ, రిజిస్టర్డ్ పోస్టు ద్వారాగానీ సమర్పించాలన్నారు. తగిన ఆధారాలు లేని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం జరగదన్నారు. వ్యక్తిగత దరఖాస్తులను మాత్రమే సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 08592–281310 నంబర్‌ను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.
● సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
ఒంగోలు సబర్బన్: సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌సీఎస్‌సీఎల్) ప్రకాశం జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక సంతపేటలోని ఏపీఎస్‌సీఎస్‌సీఎల్ డీఎం కార్యాలయం ముందు గురువారం నిరసనకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ జిల్లాలో చాలామంది ఉద్యోగులు 5 నుంచి 15 సంవత్సరాలకుపైగా కార్పొరేషన్‌లో సేవలందిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ కొత్తగా చేరిన ఉద్యోగులతో సమాన వేతనం పొందుతున్నారన్నారు. అనుభవం, సేవా కాలానికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. అనుభవం ఆధారంగా ఇంక్రిమెంట్ పాలసీ అమలు చేయాలని, 5 నుంచి 15 సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, సీనియర్ ఉద్యోగులకు ప్రత్యేక వేతన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనుభవాన్ని గుర్తించి వేతనాలు నిర్ణయించాలన్నారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: ఈ–సర్వీసు ద్వారా వచ్చే నిధులు ఎప్పటికప్పుడు బ్యాంకులో జమచేయాలని డీఎస్‌జీఎస్‌డబ్ల్యూ జిల్లా అధికారి ఎం.వెంకటేశ్వరరావు స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఒంగోలు నగరంలోని శారదా బాలకుటీర్ స్వర్ణ వార్డు కార్యాలయాన్ని, మంగమూరు గ్రామంలో స్వర్ణ గ్రామ వార్డులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పథకాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డులకు సంబంధించిన రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరణ చేసుకోవాలన్నారు. మంగమూరు ఈ – సర్వీస్ ద్వారా వచ్చిన నగదు ఇంకా రూ.13,326 బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్వర్ణ గ్రామ సేవల ద్వారా ప్రతిరోజూ వసూలయ్యే నగదును ఎటువంటి పెండింగ్ లేకుండా అదే రోజు చలానా ద్వారా సంబంధిత బ్యాంకులో జమ చేయాలని వార్డుల్లో, గ్రామాల్లో డిజిటల్ సహాయకులను, అర్బన్ ప్రాంతాలలో ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సహాయకులను ఆదేశించారు. స్వర్ణ గ్రామ కార్యాలయంలో వచ్చిన అర్జీలను వెరిఫికేషన్ చేసి వారికి స్వయంగా ఫోన్ చేసి ఈ సమస్య పరిష్కరించబడిందా అని అడిగారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రతాప్, స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.


