పొగాకు కొనుగోలుకు వెయ్యి కోట్లు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

పొగాకు కొనుగోలుకు వెయ్యి కోట్లు కేటాయించాలి

Jul 24 2026 2:21 AM | Updated on Jul 24 2026 2:21 AM

29న హైవేల దిగ్బంధనాన్ని విజయవంతం చేయాలి నాగులుప్పలపాడు మండలంలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

అమ్మనబ్రోలు సభలో మాట్లాడుతున్న జయంత్‌బాబు

బైక్‌ ర్యాలీలో పాల్గొన్న రైతు సంఘ నాయకులు, రైతులు

నాగులుప్పలపాడు: పొగాకు కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి రైతులను ఆదుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకుడు జయంత్‌బాబు డిమాండ్‌ చేశారు. రైతుల వద్ద ఉన్న పొగాకును ప్రభుత్వ రంగ సంస్థలచే వెంటనే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో గురువారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు మండలంలోని కరవది నుంచి నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు, నాగులుప్పలపాడు, బీ నిడమానూరు గ్రామాల మీదుగా మద్దిపాడు మండలంలోకి బైక్‌ ర్యాలీ ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు సభలలో నాయకులు చుండూరి రంగారావు, జయంత్‌బాబు, లలిత కుమారి, సాగర్‌ మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని 90 రోజులుగా ఉద్యమిస్తున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాలు పొగాకు పంట ద్వారా ఏటా రూ.88 వేల కోట్ల ఆదాయం పొందుతున్నప్పటికీ పొగాకు రైతుల గోడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. జూన్‌ 19న రైతులు చేపట్టిన ట్రాక్టర్‌, మోటార్‌ సైకిల్‌ ర్యాలీ తర్వాత ప్రభుత్వం దిగివచ్చి కిలో రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ వ్యాపారస్తులు బేఖాతరు చేస్తూ ధరలు తగ్గిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో బ్యారన్‌కు రూ.5 లక్షలకుపైగా రైతులు నష్టపోతున్నారన్నారు. బైకు ర్యాలీ ద్వారా రైతులను చైతన్యపరచడంతో పాటు ఈ ప్రభుత్వం ఇలాగే మొండివైఖరితో ఉంటే ఈ నెల 29న హైవే దిగ్బంధాలకు పిలుపునిచ్చామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే చలో అమరావతికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా నాయకులు, పొగాకు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement