నేటి నుంచి పాలంకేశ్వరుడి తిరునాళ్లు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పాలంకేశ్వరుడి తిరునాళ్లు

Jul 24 2026 2:21 AM | Updated on Jul 24 2026 2:21 AM

యర్రగొండపాలెం: దట్టమైన నల్లమల అడవిలో వెలసిన పాలంకేశ్వరుడి తిరునాళ్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన పాలంకేశ్వరుడు, భద్రకాళి అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కృష్ణానది ఒడ్డున వెలసిన పాలంక వీరభద్రస్వామి ఏకరాతి పందిరి కింద భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నల్లమల అందాలకు పరవశించిన పరమ శివుడు ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. స్వామి పాలంకేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటారు. శ్రీశైలం సమీపంలోని ఈ ఆలయంలో ఆరోగ్య, సౌభాగ్య, సంతాన ప్రదాత వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవార్లు కొలువై ఉన్నారు. పర్వతాల మల్లయ్య, పాలంక వీరయ్య అంటూ పాడుకునే జానపద గేయాల ద్వారా ఈ క్షేత్రాన్ని శ్రీశైల క్షేత్రంతో పోల్చుతారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినాన వీరభద్రస్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

సుదూర ప్రాంతాల నుంచి

భక్తుల రాక...

పాలంకేశ్వరుడి తిరునాళ్లు సందర్భంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్‌, గుంటూరు, నల్గొండ జిల్లాలకు చెందిన భక్తులు పాలంక క్షేత్రానికి చేరుకుంటారు. ఆదిశేషుని ఆకారంలో ఉన్న కొండచరియ కింద మూలవిరాట్‌ పాలంకేశ్వరుడు, వీరభద్రుడు, గణపతి, పంచముఖబ్రహ్మ, పోతురాజుల ఆలయాలు, పది అడుగుల ఎత్తులో నాగమయ్య పుట్ట ఉండటం ఇక్కడ ప్రత్యేకత. మండలంలోని వెంకటాద్రిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి చేరుకునేందుకు దాదాపు 40 కిలోమీటర్ల మేర నల్లమల అడవిలో యాత్ర సాగించాల్సి ఉంది. అక్కడికి వెళ్లేందుకు యర్రగొండపాలెం నుంచి జీపులు, ట్రాక్టర్లు, లారీలు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement