టీడీపీ సానుభూతిపరుని నిర్వాకం ఆందోళనలో ఆయకట్టు రైతులు
సింగరాయకొండ:
మండలంలోని పాతసింగరాయకొండ పంచాయతీలోని మేళంవాగు చెరువు కట్టను మంగళవారం భార్యా భర్తలైన టీడీపీ సానుభూతిపరుడు, 5వ వార్డు మెంబరు బిళ్లా బాలకోటయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ బిళ్లా లతలు తమ పొలానికి దారి కోసం ధ్వంసం చేశారని ఆయకట్టు రైతులు ధన్నాసి ప్రభాకర్, దాసరి శ్రీను, మద్దసాని మౌలాలి, ధన్నాసి పోతురాజు ఆరోపించారు. ఇటీవల బాలకోటయ్య చెరువు కట్టకు ఆనుకుని ఉన్న బొడ్డు చిన ముత్యాలమ్మ, దేవమ్మకు చెందిన 1.30 ఎకరాల అసైన్‌మెంట్ భూమిని కొనుగోలు చేసి అందులో మామిడి మొక్కలు పెంచటానికి దారి కోసం కట్టను ధ్వంసం చేశాడని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు బుధవారం ఉదయం చెరువు కట్టను పరిశీలించారు. దృఢంగా ఉన్న చెరువు కట్ట ఇతని చర్యల కారణంగా బలహీనమైందని, ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి చెరువు కట్టను బాగు చేయటంతో పాటు ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


