ఒంగోలు టౌన్: మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో దళిత, గిరిజన కుటుంబాలను విషాదంలో నింపింది. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మార్చురీ బయట పరిస్థితి మరింత విషాదంగా ఉంది. మార్చురీలో నిర్జీవంగా తల్లి పడుంటే, అదే మార్చురీ బయట అమ్మ కావాలంటూ ఆమె ఇద్దరు కూతుళ్లు మూడున్నరేళ్ల వలంశిక, రెండేళ్ల శ్రీహర్షిక తల్లి కోసం గుక్కపట్టి రోదిస్తున్నారు. ఒక కూతురిని పోగొట్టుకొని, చావు బతుకులతో పోరాడుతున్న మరో కూతుర్ని తలచుకుంటూ గుండెలవిసేలా ఒక తల్లి రోదిస్తోంది. కుటుంబానికి అండగా ఉన్న తల్లి పోయి అల్లాడిపోతున్న కుటుంబం మరోపక్క విలపిస్తుంటే... రెండేళ్ల పాలన విజయోత్సవాల పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మూడు రోజులుగా రోడ్డు పక్కన పడి ఉన్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పని అధికారులు, ప్రజా ప్రతినిధులు వారికి అండగా నిలిచిన ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం వివాదంగా మారింది.
మూడు రోజులుగా మార్చురీ వద్దనే...
రోడ్డు ప్రమాదం జరిగి మూడు రోజులైంది. నాగులుప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన కవిల సజన, పల్నాడు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన బుజ్జిబాయి ఈ ప్రమాదంలో మరణించారు. కవిల సజన సోదరి ఉజ్వల పక్కటెముకలు విరిగిపోయి, లివర్ దెబ్బతిని చావు బతుకుల మధ్య ఉంది. సజనకు ఇద్దరు కుమార్తెలు, బుజ్జిబాయికి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దాంతో తమ కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితులు అడుగుతున్నారు. అయితే వారికి ఇప్పటి వరకు అలాంటి భరోసా లభించలేదు. నిరుపేద దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన ఇరువురు మహిళలు మరణించినప్పటికీ కనీసం ఒక్క అధికారి కానీ, ప్రజా ప్రతినిధి కానీ వచ్చి పలకరించిన పాపాన పోలేదు. తగిన న్యాయం చేస్తామని ధైర్యం చెప్పలేదు. కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మార్చురీలో ఫ్రీజర్లు నిలిపేసి...
రోడ్డు ప్రమాదంలో మరణించిన కవిల సజన, బుజ్జిబాయి మృతదేహాలను రెండు రోజులుగా మార్చురీలో ఉంచారు. కారు ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. మృతదేహాలకు ఇంత వరకు పోస్టుమార్టం నిర్వహించలేదు. కానీ గురువారం హడావుడిగా మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయడంలేదని నోటీసులు అంటించారు. దీంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మార్చురీ ఫ్రీజర్లు మరమ్మతులో ఉన్నాయని చెప్పడం అబద్ధమని, ఇప్పటి వరకు పనిచేసిన ఫ్రీజర్లు ఒక్కసారిగా ఎలా చెడిపోతాయని ప్రశ్నిస్తున్నారు. తమ మీద ఒత్తిడి పెంచడానికే ఫ్రీజర్ల నాటకాలాడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగి మూడు రోజులు కావడంతో మృతదేహాలు ఇప్పటికే ఉబ్బి పోయాయని తెలిపారు. ఇప్పుడు ఫ్రీజర్లను ఆపివేస్తే కుళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా సంఘాల నాయకుల అరెస్టు...
ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడితే శంకర్ నాయక్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురాం, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు నీలం నాగేందర్, గిరిజన సంఘం నాయకుడు పేరం సత్యం ఆధ్వర్యంలో జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వడితే శంకర్ నాయక్ మాట్లాడుతూ... ఒక పక్క దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన మహిళలు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మరోపక్క పాలకులు, అధికారులు రెండేళ్ల విజయోత్సవాల సంబరాలు చేసుకోవడం విచారకరమన్నారు. కనీస మానవతా దృక్పథంతోనైనా బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులైనా బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం వెనక అంతర్యమేమిటని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రెండేళ్ల విజయోత్సవ సభలో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం అందజేసేందుకు వెళుతున్న దళిత, గిరిజన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జీజీహెచ్ బయట కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం శంకర్ నాయక్, నీలం నాగేందర్, రఘురాం, సీపీఎం నాయకులు తంబి శ్రీనివాసులు, సైదా నాయక్, బుజ్జిబాయి కుటుంబ సభ్యులు పాత్లావత్ కిష్టమ్మ, శ్రావణిబాయి, బాజియా బాయి, వస్త్రం నాయక్, వెంకటేశ్వర్లు నాయక్ సహా మొత్తం 18 మందిని పోలీసులు అరెస్టు చేసి కొత్తపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు. న్యాయం చేయాలని కోరితే అరెస్టు చేయడం దుర్మార్గమని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు రోజులుగా రిమ్స్ మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్న రోడ్డు ప్రమాద
బాధితుల కుటుంబాలు
మార్చురీ బాక్సుల ఏసీని నిలిపేసి ఒత్తిడికి గురిచేస్తున్నారని బాధిత
కుటుంబాల ఆరోపణ
నేటి వరకు పరామర్శించని ప్రజా
ప్రతినిధులు, పలకరించని అధికారులు
విజయోత్సవాల్లో మునిగితేలిన
ప్రజాప్రతినిధులు, అధికారులు
బాధితులకు అండగా నిలిచిన దళిత, గిరిజన సంఘాల నాయకుల అరెస్టు


