పొగజూరిన ఆశలు | - | Sakshi
Sakshi News home page

పొగజూరిన ఆశలు

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

రోజు రోజుకీ మరింత దిగజారుతున్న పొగాకు సరాసరి అమ్మకం ధర 2023–24తో పోలిస్తే చంద్రబాబు పాలనలో దారుణం కేవలం రెండు రబీ సీజన్‌లలోనే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి పొగాకు రైతులు ఈనెల 19న ఒంగోలులో భారీ ట్రాక్టర్‌ ర్యాలీతో నిరసనకు పొగాకు రైతుల సన్నద్ధం

వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధరల సాధన కోసం

రేపు ఒంగోలులో ట్రాక్టర్‌ ర్యాలీ

పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి...

పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలి. గిట్టుబాటు ధర లేక పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు. అప్పులు తీర్చలేక కష్టాల్లో కౌలు, సన్న, చిన్నకారు రైతులు విలవిల్లాడుతున్నారు. వ్యవసాయ రంగం కుదేలైపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రైతుల్లో కొనుగోలు శక్తి తగ్గుతుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయంపైన కూడా దీని ప్రభావం పడుతుంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాపారులకు పోటీగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి దాదాపు రూ.300 కోట్లకు పైగా వెచ్చించారు. అదేపనిని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది.

– ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

రబీ సాగులో పొగాకు అమ్మకం ధర దారుణంగా ఉంది. 2023–24 మార్కెటింగ్‌ సీజన్‌కి 215.35 మిలియన్‌ కేజీల పొగాకు ఉత్పత్తి అయితే సరాసరి అమ్మకం ధర కేజీకి రూ.288.65 గా ఉంది. గత సంవత్సరం 2024–25 లో 240.64 మిలియన్‌ కేజీల పొగాకు ఉత్పత్తి అయితే కిలో సరాసరి అమ్మకం ధర మాత్రం రూ.248.86 కు పడిపోయింది. 2025–26 రబీ సీజన్‌కు తీసుకుంటే సాగు విస్తీర్ణం గత సంవత్సరం 1.20 లక్షల హెక్టార్లు అయితే ఈ ఏడాది 1.17 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. మూడో ముందస్తు అంచనా ప్రకారం హెక్టారు సరాసరి దిగుబడి 2221 కిలోలు. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తి అంచనా సుమారు 260 మిలియన్‌ కేజీలు రావాలి. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి రాష్ట్రం మొత్తం సరాసరి అమ్మకం ధర కిలోకి రూ.237.21 కి పడిపోయింది. అదే ఈనెల 1వ తేదీకి రూ.235.63కు పడిపోయింది. 9వ తేదీ నాటికి రూ.232 కి మరింత తగ్గింది. ఈనెల 11వ తేదీ నాటికి మొత్తం సరాసరి అమ్మకం ధర రూ.230.58 మాత్రమే. ఈ సంవత్సరం ఉత్పత్తి అంచనా సుమారు 265 మిలియన్‌ కేజీలు అయితే ఎస్‌ఎల్‌ఎస్‌లో ఇప్పటి వరకు 93.05 లక్షల కేజీలు, ఎస్‌బీఎస్‌లో 66.75 లక్షల కేజీలు మాత్రమే అమ్మకాలు జరిగాయి.

దక్షిణాదిలో పరిస్థితి దారుణం...

అందులోనూ ఒంగోలు దక్షిణాది నల్ల నేలల్లో జూన్‌ మొదటి వారం నాటికి సరాసరి ధర రూ.224.45, 9వ తేదీ నాటికి రూ.221.57 పడిపోయింది. అదే 12వ తేదీ సరాసరి అమ్మకం ధర రూ.200.41 కాగా కనిష్ట ధర రూ.160. గరిష్ట ధర రూ.250 దాటలేదు. దక్షిణాది తేలిక నెలల్లో ఈనెల 1వ తేదీ నాటికి రూ.231.02, 9వ తేదీకి రూ.228.39 కు సరాసరి ధర పడిపోయింది. అదే 12వ తేదీన సరాసరి అమ్మకం ధర రూ.211.04, కనిష్ట అమ్మకం ధర రూ.160 కాగా, గరిష్ట అమ్మకం ధర రూ.250, దక్షిణాది నల్ల నేలల (ఎస్‌బీఎస్‌) పరిధిలోకి వచ్చే ఒంగోలు 1, ఒంగోలు 2, టంగుటూరు 1, కొండపి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో 12వ తేదీన సరాసరి తిరస్కరణ బేళ్లు 21.37 శాతంగా ఉన్నాయి. దక్షిణాది తేలిక నెలలు (ఎస్‌ఎల్‌ఎస్‌) పొదిలి–1, కనిగిరి, కందుకూరు–1, కందుకూరు–2, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో తిరస్కరించిన బేళ్లు 12వ తేదీ నాటికి 21.81 శాతంగా ఉంది.

ఉత్తరాదిలోనూ అదే పరిస్థితి...

ఉత్తరాది తేలిక నేలల్లో ఈనెల 1వ తేదీ వరకు సరాసరి ధర రూ.260.29 గా ఉంది. అదే 9వ తేదీ నాటికి రూ.257.91. 12వ తేదీన రూ.255.98 దిగజారింది. 2023–24 ధర రూ.288.65 పోలిస్తే 11వ తేదీ వరకు రైతులు సరాసరిన కిలోకు రూ.32.67 నష్టపోతున్నారు. దీనికి పెరిగిన ఉత్పత్తి వ్యయం సంవత్సరానికి కిలోకు కనీసం రూ.10 చొప్పున రెండు సంవత్సరాలకు కలిపి రూ.20 అదనపు నష్టం రైతులు భరిస్తున్నారు. ఉత్తరాది తేలిక నేలలు (ఎన్‌ఎల్‌ఎస్‌) దేవరపల్లి, జంగారెడ్డిగూడెం–1, జంగారెడ్డిగూడెం–2, కొయ్యలగూడెం, గోపాలపురంలలో తిరస్కరించిన బేళ్లు అలానే ఉన్నాయి. ఇలా తిరస్కరించిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లడానికి బేలుకు రూ.2 వేలు అదనంగా ఖర్చవుతుంది.

గ్రామీణ వ్యవసాయ రంగం కుదేలు:

గ్రామీణ వ్యవసాయ రంగం క్రమంగా కుదేలవుతోంది. అత్యధిక శాతం కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. తెచ్చిన అప్పులు కట్టలేని పరిస్థితుల్లోకి బలవంతంగా నెట్టబడుతున్నారు. రుణాలు తెచ్చి సాగుచేసినా పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకుని వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధరలపై దృష్టి సారించాల్సిన అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొగాకు ధరలు నానాటికీ దిగజారుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిరసనగా ఈ నెల 19న ఒంగోలులో పొగాకు రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు

చరిత్రలో మొట్ట మొదటి సారిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పొగాకును కూడా మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు చేయించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పొగాకు రైతుల కోసం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మార్కెట్‌లో పోటీ పెరిగి ఆ మూడు, నాలుగు సంవత్సరాలు రైతులకు మంచి లాభాలు వచ్చాయి. రైతు ఎంతో సంతోషపడ్డాడు. రైతు లోగిళ్లు కళకళలాడాయి. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రయత్నం ఎందుకు చెయ్యటం లేదో అర్థం కావటం లేదు. మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చి కూడా అమ్మకం ధరలు కుప్పకూలి రైతు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాడు.

మొత్తంగా తగ్గిపోతున్న సరాసరి ధర...

ఈ మూడు సీజన్ల పొగాకు అమ్మకం ధరలను పరిశీలిస్తే... 2023–24 మొత్తం సరాసరి అమ్మకం ధర కేజీ రూ.288.65. 2024–25లో మొత్తం సరాసరి అమ్మకం ధర కేజీ రూ.248.86. ఈనెల 1వతేదీ వరకు సరాసరి అమ్మకం ధర రూ.235.63. ఈనెల 9వ తేదీ నాటికి రూ.232. 11వ తేదీ నాటికి సరాసరి అమ్మకం ధర రూ.230.58.కానీ 12 వతేదీ ఒక్క రోజు మొత్తం సరాసరి అమ్మకం ధర కిలో రూ.211 మాత్రమే. ఇది ఇంకా ఎంత తగ్గుతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రోజు రోజుకీ సరాసరి అమ్మకం ధర పడిపోతూ తీవ్ర సంక్షోభాన్ని తెలియజేస్తోంది.

ఒంగోలు సబర్బన్‌: వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధరల సాధన కోసం ఒంగోలు నగరంలో శుక్రవారం ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘ ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు చుండూరు రంగారావు తెలిపారు. జూన్‌ 19న ఒంగోలులో జరిగే ట్రాక్టర్‌ ర్యాలీని జయప్రదం చేయాలని ఆయన పొగాకు రైతులను, రైతు నాయకులను కోరారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని పొగాకు బోర్డు కార్యాలయం, మినీస్టేడియం నుంచి ట్రాక్టర్‌ ర్యాలీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement