కట్టలుతెగిన భూదాహం | - | Sakshi
Sakshi News home page

కట్టలుతెగిన భూదాహం

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

నేతివారికుంట చెరువు కట్టను ధ్వంసం చేస్తున్న పచ్చనేతలు నాలుగు రోజులుగా జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా కట్ట మట్టి తరలింపు అంతా మా ఇష్టం అంటున్న పచ్చనేతలు పట్టించుకోని అధికారులు మట్టి తవ్వకాలు అడ్డుకున్న ఆయకట్టు రైతులు

జరుగుమల్లి (సింగరాయకొండ): టీడీపీ నాయకుడు తమకు ఇష్టం వచ్చినట్లు చెరువుకట్టను ధ్వంసం చేసి మట్టిని తరలిస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో చివరకు ఆయకట్టు రైతులే నడుం బిగించి తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ ఘటన జరుగుమల్లి గ్రామ పంచాయతీలోని పంగులూరివారిపాలెం గ్రామంలోని నేతివారికుంట చెరువు వద్ద బుధవారం జరిగింది. వివరాల ప్రకారం పంగులూరివారిపాలెంలోని నేతివారికుంట చెరువు కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉంది. రైతులు పొగాకు, శనగ పంటలతో పాటు జామాయిల్‌ సాగు చేస్తుంటారు. ఈ చెరువులో ఎప్పుడూ నీరు సమృద్ధిగా ఉంటుందని నీటి ఎద్దడి సమస్య తలెత్తలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

చెరువు కట్టలు ధ్వంసం:

మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తన ఇంటి అవసరాల కోసం చెరువు మట్టిని ట్రాక్టరు, జేసీబీల ద్వారా తరలించాడు. రైతులు కూడా చెరువులో మట్టిని తీసుకుని పోవాలే తప్ప చెరువు కట్టలు ధ్వంసం చేయవద్దని సూచించారు. కానీ సదరు టీడీపీ నాయకుడు మాత్రం చెరువు కట్టను ధ్వంసం చేసి మరీ మట్టిని తరలించాడు. దీనిపై రైతులు తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు కు సమస్యను వివరించి చెరువు కట్టను కాపాడాలని కోరారు. కానీ ఆయన ఇది ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన సమస్య అని మీరు ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. ఒక పక్క చెరువు కింద ఆయకట్టు పొలాలకు నీటితీరువా పన్ను కట్టించుకుంటూ మాకు సంబంధం లేదని తహశీల్దార్‌ ఎలా చెబుతారని రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న అధికారి బాధ్యతా రాహిత్యంగా అధికార పార్టీ నాయకులకు అండగా ఎలా ప్రవర్తిస్తారని రైతులు విమర్శిస్తున్నారు. నాలుగు రోజులుగా చెరువు కట్ట ధ్వంసం చేస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలీసు, మైనింగ్‌, గ్రామపంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప అక్రమాన్ని అడ్డుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. చివరికి బుధవారం ఆయకట్టు రైతులు మూకుమ్మడిగా వచ్చి అక్రమాన్ని అడ్డుకుని జేసీబీని అక్కడి నుంచి పంపించేశారు. చెరువు కట్టలు ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయకట్టు రైతులు తెగేసి చెబుతున్నారు. నేతివారికుంట చెరువు కట్టలను ధ్వంసం చేయటాన్ని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ వరలక్ష్మి, ఈఈ శివరాం ప్రసాద్‌ దృష్టికి తీసుళ్లారు. దీంతో గురువారం ఏఈ రవికుమార్‌ ని పంపించి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement