సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): భూముల రీ సర్వేని రైతుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించాలని కర్నూలు రీజినల్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సంతనూతలపాడు మండలం మైనంపాడులో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని బుధవారం వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. రీ సర్వే ప్రక్రియపై స్థానిక రైతులతో వెంకటేశ్వరరావు సమీక్షించారు. రైతుల సమక్షంలో పక్కాగా రీ సర్వే జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈకేవైసీ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ ఒక్క రైతూ ఇబ్బందిపడకూడదన్నారు. నెట్‌వర్క్ సమస్య ఉంటే ఇతర మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో సరిహద్దు వివాదాలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ గౌస్ బాషా, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి రమణ, జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే పరిశుద్ధరావు, సంతనూతలపాడు తహసీల్దార్ నారాయణరెడ్డి, మండల సర్వేయర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు రీజినల్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు
పరిశీలించిన రాష్ట్ర, జిల్లా అధికారుల బృందం


