ఉదయం ఆరు గంటల నుంచే మొరాయించిన సర్వర్ పింఛన్ల పంపిణీలో అవస్థలు గంటల కొద్దీ నిరీక్షించిన లబ్ధిదారులు మండుటెండల్లో అవస్థలు పడిన సిబ్బంది, పింఛన్‌దారులు ఉమ్మడి జిల్లాలో 3,59,185 మంది లబ్ధిదారులు నేడు కూడా పింఛన్ల పంపిణీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రహసనంలా మారింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటల కొద్దీ లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. పింఛన్‌ల పంపిణీ కోసం సోమవారం ఉదయాన్నే ప్రభుత్వ సిబ్బంది పింఛన్‌దారుల వద్దకు వెళ్లారు. అయితే అధికారుల వేలిముద్రలు, ఐరిస్ తీసుకునే మిషన్లు సర్వర్ సమస్య కారణంగా మొరాయించాయి. ఉదయం తొమ్మిది గంటలైనా సర్వర్లు పనిచేయలేదు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. వేసవి ఎండలతో ఇబ్బందులు పడుతున్న వారికి చాలా ప్రాంతాల్లో తాగడానికి నీళ్లులేక ఇక్కట్లపాలయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,59,185 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రూ.158 కోట్లు మంజూరు చేసింది. ప్రకాశం జిల్లాలో 2,18,184 మందికి గాను రూ.95.41 కోట్లు, మార్కాపురం జిల్లాలో 1,41,001 మంది ఉండగా రూ.68 కోట్లు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా సాంకేతిక సమస్య కారణంగా పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యమైంది. దీంతో ఒక పింఛన్ ఇవ్వడానికి అర గంట నుంచి గంట వరకు సమయం తీసుకున్నారు. ఒక్కో వ్యక్తికి దాదాపు 60–80 పింఛన్లను పంపిణీ చేసేందుకు కేటాయిస్తారు. వాటిని గతంలో మధ్యాహ్నానికి పంపిణీ పూర్తి చేసుకునేవారు. లాగిన్ అయ్యి ఇద్దరికి పింఛన్లు ఇచ్చే సరికి మళ్లీ సర్వర్ మొరాయించింది. ఫలితంగా సాయంత్రం నాటికి ప్రతి ఒక్కరూ 40 నుంచి 50 పింఛన్లు పంపిణీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛన్ల పంపిణీలో ఉన్న సిబ్బంది ఎండల తీవ్రత కారణంగా ఇబ్బంది పడ్డారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం–3 లో అయితే కొందరు సచివాలయ సిబ్బంది ఇంటికి రాకపోవటంతో లబ్ధిదారులు గ్రామ సచివాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి పడిగాపులు కాశారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసినా పింఛన్ పంపిణీ లో ఉన్నామని, వస్తున్నామని చెప్పడంతో వారి కోసం మధ్యాహ్నం 12.15 వరకు నిరీక్షించారు. ఆకలి దప్పులతో అల్లాడారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని వరిగచేను సంఘం, చైతన్యనగర్ వంటి ప్రాంతాల్లో పింఛనుదారులు సచివాలయాల వద్దకు వెళ్లారు. అక్కడా సిబ్బంది లేకపోవడంతో ఆందోళన చెందారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఈ సమస్యతో పింఛన్ల పంపిణీ చాలా ఆలస్యంగా జరిగింది. దర్శి నియోజకవర్గంలో దర్శి నియోజకవర్గంలో నత్తనడకన పింపిణీ సాగింది. సాధారణ రోజుల్లో రెండు గంటల వ్యవధిలో తమకు కేటాయించిన 50 నుంచి 80 పింఛన్లు పంపిణీ పూర్తి చేస్తారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా 60 శాతం మేరకు మాత్రమే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంపిణీ చేసినట్టు తెలిసింది.
ఆగి..సాగిన పింఛన్ల పంపిణీ
కనిగిరి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆగి సాగింది. ఉదయాన్నే గంటకు పైగా సర్వర్ సమస్యతో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. ఆతర్వాత కూడా మధ్యలో కొన్ని మండలాల్లో గంటకు పైగా సర్వర్ నిలిచింది. పింఛన్‌దారులకు తొందరగా పింఛన్ నగదు చేరకపోవడంతో ఇబ్బంది పడ్డారు. కనిగిరి పట్టణంతో పాటు, మిగతా కొన్ని మండలాల్లో సచివాలయ సిబ్బంది తమ టార్గెట్‌ను పూర్తి చేసుకునేందుకు రాత్రి వరకు పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం.
2 గంటల పాటు టెన్షన్.. టెన్షన్..
మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులు పింఛను కోసం పడిగాపులు కాశారు. సర్వర్‌లో సమస్య రావడంతో సచివాలయ సిబ్బంది చాలా సేపు రాలేదు. ఇదే సమయంలో లబ్ధిదారులు పింఛను అందక టెన్షన్ పడ్డారు. ఒక్కొక్క చోట ఒక్కో ప్రాంతంలో సర్వర్ సమస్య గంట నుంచి రెండు గంటల పాటు ఉంది. సోమవారమే పింఛన్లు పంపిణీ పూర్తికావాలని ప్రభుత్వం ఆదేశించడంతో సచివాలయ సిబ్బంది సర్వర్ పనిచేయక హైరానా పడ్డారు.
మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, యర్రగొండపాలెం, దోర్నాల, పుల్లలచెరువు, అర్ధవీడు తదితరమండలాల్లోని పలు గ్రామాల్లో సర్వర్ సమస్య ఏర్పడింది. దీనితో పింఛను పంపిణీ ఆలస్యంగా జరిగింది.


