అందుబాటులో బంగినపల్లి మామిడి
ఉలవపాడులో ప్రారంభమైన మ్యాంగో సీజన్
ఉలవపాడు:
ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 18 వేల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి. ఒక్క ఉలవపాడు ఉద్యానవన శాఖ పరిధిలో సుమారు 9 వేల ఎకరాలలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా పూతలు ఆలస్యంగా వచ్చాయి. పిందెలు కూడా ఆలస్యం కావడంతో పాటు ప్రస్తుతం 50 శాతం కాపు మాత్రమే వచ్చింది. ఏప్రిల్లోనే వచ్చే మామిడి కాయలు ఈ ఏడాది మే నెల రెండో వారంలో ప్రారంభమయ్యాయి. మే 20 నుంచి పూర్తి స్థాయిలో అన్ని తోటల్లో కాయలు పక్వానికి వచ్చాయి. జూన్ నెల చివరి వరకు ఈ మామిడి కాయలు అందుబాటులో ఉంటాయని రైతులు చెబుతున్నారు. ఉలవపాడు ప్రాంతంలో పండించే బంగినపల్లె రకానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఉలవపాడు మామిడిలో తియ్యదనం అధికంగా ఉంటుంది. అందువలన మామిడి ప్రియులు వేసవి కాలం వచ్చిందంటే ఉలవపాడు మామిడి కాయలు తినాలని అధికంగా ఇష్టపడతారు. ఉలవపాడు తోటల నుంచి ప్రస్తుతం మామిడి కాయలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రావడం, కాయల అమ్మకాలు, కొనుగోళ్లతో సందడి వాతావరణం నెలకొంది. ఉలవపాడు ప్రాంతంలో బంగినపల్లె రకం, పెద్దరసాలు, చిన్న రసాలు, కొబ్బరిమామిడి, తోతాపురి (బెంగళూరు రకం), తక్కువ సుగర్ ఉండే హిమామ్ పసంద్ రకం, సువర్ణరేఖ, నీలం రకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారిపై దుకాణాల ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి.
ఎగుమతుల జోరు...
ప్రస్తుతం సీజన్ మంచి దశలో ఉంది. పూర్తి స్థాయిలో కాయలు అందుబాటులోకి రావడంతో వివిధ ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. తోటల వద్ద నుంచి కాయలను కొనుగోలు చేసి ట్రేలలో నింపి లారీల్లో ఎగుమతులు చేస్తున్నారు. ఇక్కడి నుంచి విదేశాలతో పాటు దేశంలోని కోల్‌కతా, ఢిల్లీ, ముంబై. హైదరాబాద్, బెంగళూరుకు అధికంగా ఎగుమతులు అవుతుంటాయి. ప్రస్తుతం బంగినపల్లె రకం మామిడి టన్ను రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతోంది. రసాలు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతున్నాయి. కాయ నాణ్యతను బట్టి రేటు నిర్ణయించి ఎగుమతులు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో ఎగుమతుల జోరు
ఆన్‌లైన్ విక్రయాలు...
గతంలో మామిడి కాయలు కావాలంటే ఎవరైనా ఉలవపాడు వచ్చి కొనుగోలు చేయాల్సిందే. లేదంటే తెలిసిన వారు కొని వారికి వాహనాల ద్వారా పంపా లి. కానీ, ఈ ఏడాది ఆన్‌లైన్ ద్వారా కూడా విక్రయా లు అధికమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా మామిడి దుకాణదారులు, వ్యాపారులు తమ ఫోన్ నంబర్లతో కాయలు ఎగుమతులు చేస్తామని ప్రకటనలు ఇచ్చారు. కొనుగోలుదారుడు ఫోన్ చేసి ఎన్ని కాయలు కావాలో చెబితే.. ఆర్టీసీ కార్గో, ప్రైవేటు వాహనాల ద్వారా వారికి చేరుస్తున్నారు. ఫోన్ ద్వారా డబ్బులు పంపిస్తే నేరుగా వారి ప్రాంతాలకు ఇప్పుడు మామిడి కాయలు పంపుతున్నారు.


