రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు వడగాడ్పులు తోడవడంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు కనిగిరిలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఉమ్మడి జిల్లాలోని 36 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రోహిణీకార్తె మొదలైన తర్వాత ఠారెత్తించిన సూర్యుడు
ఒంగోలు టౌన్:
ఉమ్మడి జిల్లాలో ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు. పది రోజులుగా రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. రోహిణీకార్తె ప్రారంభమైన తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాడ్పులు వీస్తుండటంతో ప్రజలు తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 36 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు సెగలు పుట్టించాయి. కనిగిరి, సంతనూతలపాడు, అద్దంకి మండలాల్లో జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిగిరిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత స్థానంలో సంతనూతలపాడులో 44.6 డిగ్రీలు, అద్దంకి 44.3, ముండ్లమూరు 44.1, బల్లికురవ, చీమకుర్తి 44 డిగ్రీలు నమోదయ్యాయి. ఒంగోలులో 43.8 డిగ్రీలు, మద్దిపాడు 43.1 డిగ్రీలు నమోదయ్యాయి. టంగుటూరులో 42.8 డిగ్రీలు నమోదు కాగా, జే పంగులూరు, కొనకనమిట్ల మండలాల్లో 42.7, పొన్నలూరు, కందుకూరులో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాగులుప్పలపాడులో 42.4 డిగ్రీలు, హనుమంతునిపాడు 42.3, పొదిలి, పెద్దారవీడు, కురిచేడు 42.2 డిగ్రీలు నమోదయ్యాయి. త్రిపురాంతకంలో 42.1, దర్శి, కంభం, బేస్తవారిపేట, పామూరులో 42 డిగ్రీలతో ఎండ కాసింది. కొత్తపట్నం, మర్రిపూడి మండలాల్లో 41.8, తాళ్లూరు 41.7, వెలిగండ్ల 41.6, పుల్లలచెరువులో 41.5 నమోదైంది. కొరిశపాడు, పీసీ పల్లిలో 41.3, జరుగుమల్లి 41.2, సంతమాగులూరు 41.1గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉలవపాడు, వలేటివారిపాలెం, దోర్నాలలో 41 డిగ్రీలు నమోదైంది. మరో ఏడు మండలాల్లో 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
భిన్న వాతావరణం...
ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని మండలాల్లో ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండగా, మరికొన్ని చోట్ల ఉదయం 11 గంటల వరకు చల్లగా ఉండి ఒక్కసారిగా చెలరేగిపోతున్నాడు. మధ్యాహ్నం ప్రచండరూపం చూపించి సాయంత్రానికి మళ్లీ చల్లబడుతున్నాడు. గురువారం జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, పీసీ పల్లి, మర్రిపూడి, పొన్నలూరు, కొనకనమిట్ల ప్రాంతాల్లో సాయంత్రం ఈదురుగాలుతో పాటు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఎండలు మరింత ఉగ్రరూపం దాలుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


