కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతున్న బీజేపీ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన
ఒంగోలు సిటీ:
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి షేక్ బాబు విమర్శించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఒంగోలు నగరంలోని సాగర్ హోటల్ సెంటర్ వద్ద సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షేక్ బాబు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈడీ అధికారులు పినరయి విజయన్ కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు నిర్వహించడం వెనుక బీజేపీ–కాంగ్రెస్ కుమ్మక్కు స్పష్టమవుతోందన్నారు. కేరళ ముఖ్యమంత్రి వి.డి.సతీషన్ ఢిల్లీ పర్యటన సమయంలోనే భారీ కేంద్ర బలగాలతో విజయన్ అద్దె నివాసాన్ని చుట్టుముట్టడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ దాడులు గంటల తరబడి కొనసాగాయని తెలిపారు.
కన్నూర్‌లోని విజయన్ కుటుంబ సభ్యుల నివాసాలతో పాటు ఆయన కుమార్తెకు చెందిన సంస్థ, మాజీ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ నివాసాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారని పేర్కొన్నారు. కేరళలో పది చోట్ల, బెంగళూరులో రెండు చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినా ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. గత దర్యాప్తుల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోయినా మళ్లీ దాడులు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి.వి.కొండారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జి.రమేష్, కాలం సుబ్బారావు, జయంతి బాబు, బంకా సుబ్బారావు, కంకణాల రమాదేవి, కల్పన, బి.రఘురాం, బాలకోటయ్య, నగర కార్యదర్శివర్గ సభ్యుడు తంబి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


