ఉరిమిన వరుణుడు.. పెనుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఉరిమిన వరుణుడు.. పెనుగాలుల బీభత్సం

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

కనిగిరిరూరల్‌/పీసీపల్లి/మర్రిపూడి/పొన్నలూరు/మార్కాపురం/కొనకనమిట్ల:

మ్మడి ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో బలమైన ఈదురుగాలుల ధాటికి జనం బెంబేలెత్తారు. పగలంతా సూరీడు నిప్పులు చెరగగా సాయంత్రానికి వాతావరణం చల్లబడి గాలిదుమారం రేగింది. బుధవారం అర్ధరాత్రి, గురువారం సాయంత్రం పెనుగాలులు సృష్టించిన బీభత్సానికి భారీ సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. కనిగిరి, కొండపి, మార్కాపురం నియోజకవర్గాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

● కనిగిరి నియోజకవర్గంలో సాయంత్రం 5.30 గంటపాటు ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కనిగిరి పట్టణంలో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. కనిగిరి రూరల్‌ మండలం లింగారెడ్డిపల్లి, కొత్తపల్లి, అడ్డ రోడ్డు ఏరియాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. వెలిగండ్ల మండలం వెలిగండ్ల ఎస్సీ కాలనీ, మొగళ్లూరు పల్లి, కాలనీ, చౌడవరం తదితర గ్రామాల్లో విద్యుత్‌ మెయిన్‌ లైన్‌ తీగలు తెగడంతోపాటు స్తంభాలు పడిపోయాయి. హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం మండలాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

● పీసీపల్లి మండల పరిధిలో వడగండ్ల వాన బీభత్సం సష్టించింది. మారెళ్ల సమీపంలో క్రషర్‌ మిల్లు వద్ద విద్యుత్‌ వైర్లు తెగి రోడ్డు మీద పడిపోయాయి. ఎంపీడీఓ కార్యాలయం వద్ద చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. బట్టుపల్లిలో చెట్టు కొమ్మలు పడటంతో భాస్కర్‌, ఆయన మనవరాలు శాలినికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కమ్మవారిపల్లిలో వేమూరి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న నాగార్పమ్మ కొలుపులకు వర్షం అంతరాయం కలిగించింది.

● మర్రిపూడి మండలంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల ధాటికి అంకేపల్లి, సన్నమూరు గ్రామాల్లో పొగాకు బ్యారన్లు, షెడ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా మర్రిపూడి మండలంలో సుమారు రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ఆయా గ్రామాల రైతులు అంచనా వేస్తున్నారు.

● పొన్నలూరు మండలంలో కల్లూరివారిపాలెం, కోటపాడు, బాలిరెడ్డిపాలెంతోపాటు పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. ఈదురుగాలుల ధాటికి గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

● జిల్లా కేంద్రమైన మార్కాపురంలో గురువారం పగలు 44 డిగ్రీల ఉష్ణొగ్రత నమోదు కాగా సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. పరిసర గ్రామాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మార్కాపురంలో విద్యానగర్‌కు వెళ్లే దారిలో భారీ చెట్టు కూలడంతో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి.

● కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు, చినమనగుండం, పాతపాడు, నాగంపల్లి, సలనూతల, వింజవర్తిపాడు గ్రామాల్లో ఎర్రగాలి దుమారం రేగింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం

భీకరగాలుల ధాటికి ఎగిరిపడిన షెడ్లు, పొగాకు బ్యారన్ల పైకప్పులు

భారీ సంఖ్యలో నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు

పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం

Advertisement
 
Advertisement
Advertisement