ఇదేం ‘పంచాయితీ’? | - | Sakshi
Sakshi News home page

ఇదేం ‘పంచాయితీ’?

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

మండలం పంచాయతీలు

మార్కాపురం: మార్కాపురం జిల్లా ఏర్పాటై 5 నెలలు కావస్తున్నా కీలకమైన జిల్లా పంచాయతీ అధికారి పోస్టును భర్తీ చేయడంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీపీఓ నియామకంలో జాప్యంపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతోపాటు పంచాయతీ అధికారులు, సిబ్బంది సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు నాలుగు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో కీలకమైన జిల్లా పంచాయతీ అధికారి పోస్టును ప్రభుత్వం ఖాళీగా ఉంచడంపై స్థానికంగా ఎడతెగని చర్చ నడుస్తోంది. ఇటీవల ఓటరు జాబితాలు ప్రకటించారు. గ్రామాల వారీగా, వార్డుల వారీగా పంచాయతీ వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సింది. ఇంత వరకు డీపీఓ పోస్టును భర్తీ చేయకపోవడంతో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఫైల్స్‌ పట్టుకుని ఉమ్మడి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది.

ఈ ఏడాది జనవరి మొదటి వారంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోనే డీపీఓ చాంబర్‌ ప్రారంభించారు. ప్రకాశం డీపీఓను మార్కాపురం జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించారు. కొద్దిరోజుల తరువాత మార్కాపురం డీఎల్‌డీఓకు ఇన్‌చార్జి డీపీఓ, ఇన్‌చార్జి డీఎల్‌పీఓ బాధ్యతలు అప్పగించారు. ఒకే అధికారిని 3 పోస్టులకు ఇన్‌చార్జిగా నియమించడంతో ఏ పనీ సక్రమంగా ముందుకు సాగడం లేదని సమాచారం. మరోవైపు గ్రామ పంచాయతీలో పన్ను వసూళ్లు, పారిశుధ్యం, నీటి సరఫరా, పంచాయతీ కార్యదర్శులపై పర్యవేక్షణ తదితర కీలకమైన బాధ్యతలను డీపీఓ నిర్వర్తించాల్సి ఉంది. ఇంకోవైపు ప్రభుత్వం రూర్బన్‌ కింద పలు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసింది. వీటిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా డీపీఓనే పర్యవేక్షించాలి. ఇన్ని బాధ్యతలు నిర్వహించడం అంటే ఒకే అధికారికి శిరోభారమే.

రిజర్వేషన్‌పై తకరారు

మార్కాపురం జిల్లాలో 406 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం స్పెషల్‌ ఆఫీసర్ల పాలనలో ఉన్న పంచాయతీలకు రిజర్వేషన్ల ఖరారు డీపీఓ ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉంది. కీలకమైన ఫైళ్లను ప్రస్తుతం అధికారులు ఒంగోలుకు తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా డీపీఓను నియమించాలని జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశిస్తున్నారు.

మార్కాపురం డీపీఓ నియామకంలో సర్కారు మీనమేషాలు

ఒంగోలు వెళ్లలేక తంటాలు పడుతున్న పంచాయతీ

యంత్రాంగం

మార్కాపురం 24

పొదిలి 16

తర్లుపాడు 16

కొనకనమిట్ల 26

పామూరు 25

వెలిగండ్ల 21

అర్ధవీడు 15

బేస్తవారపేట 19

కంభం 14

దోర్నాల 14

గిద్దలూరు 19

హెచ్‌ఎంపాడు 23

కనిగిరి 25

కొమరోలు 14

పీసీపల్లి 18

పెద్దారవీడు 19

పుల్లలచెరువు 19

రాచర్ల 14

త్రిపురాంతకం 24

యర్రగొండపాలెం 18

Advertisement
 
Advertisement
Advertisement