గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026

న్యూస్‌రీల్‌

పొన్నలూరులో నిరుపయోగంగా

ఆశ్రమ పాఠశాల కొత్త భవనం

గిరి పుత్రులు..

అద్దె చదువులు

పొన్నలూరు:

గిరిపుత్రుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించేందుకు ఏర్పాటైన ఆశ్రమ పాఠశాలలను చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తోంది. పేద గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాల సొంత భవనం, కనీస వసతులకు నోచుకోక కునారిల్లుతోంది. నిధులున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో అద్దె భవనాల్లోనే అవస్థలు పడుతున్నారు పొన్నలూరు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు. సాక్షాత్తూ సంక్షేమశాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండడం గమనార్హం. దాదాపు 25 సంవత్సరాల కిందట ఆశ్రమ పాఠశాల ఆరంభమైంది. అప్పటి నుంచి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకూ అద్దె భవనాల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022 సంవత్సరంలో పదో తరగతి వరకూ చదువుకునే అవకాశాన్ని అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొదటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆ తరువాత ఉపాధ్యాయుల కృషితో ప్రస్తుతం 150 మంది ఉన్నారు. ఈ పాఠశాలకు పక్కాభవనం నిర్మించడానికి కొన్నేళ్ల క్రితం శ్రీశైలం గిరిజన సమగ్ర అభివృద్ధిశాఖ సంస్థ నుంచి రూ.5.40 కోట్లు మంజూరయ్యాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే నిర్మించడానికి 1.10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. అందులో రూ.3.50 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టి 80 శాతం వరకు నిర్మాణ పనులు పూర్తిచేశారు. అయితే మిగిలిన ఫ్లోరింగ్‌, గ్రిల్స్‌, తలుపులు, కిటికీలు, ప్రహరీ, విద్యుత్‌ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేయకుండా కాంట్రాక్టర్‌ వెళ్లిపోయాడు. గిరిజన విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు అప్పటి కలెక్టర్‌ పాఠశాలను సందర్శించారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.2.50 కోట్లతో అంచనాలు తయారు చేసి నిధులు మంజూరు కోసం విజయవాడ ఈఎన్‌సీ కార్యాలయానికి పంపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి సౌకర్యాలతో పక్కా భవనాన్ని పూర్తి చేసేందుకు 2024–25లో శ్రీశైలం గిరిజన సమగ్ర అభివృద్ధి సంస్థ రూ.3.26 కోట్లు మంజూరు చేసింది. 2025 అక్టోబర్‌ నెలలో రీ టెండర్‌ ద్వారా పనులు ఇవ్వాలని ఐటీడీఏ అధికారులు సూచించారు. 2017 సంవత్సరంలో ఉన్న పాత రేట్ల ప్రకారం పనులు చేపట్టాలని నిబంధన విధించడంతో పాత రేట్లు ప్రకారం పనులు చేపడితే తాము నష్టపోతామని టెండర్‌ వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా భవన నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. వాస్తవంగా 2026 విద్యా సంవత్సరానికి గిరిజన ఆశ్రమ పాఠశాల భవన అసంపూర్తి పనులు పూర్తిచేసి వాడుకలోకి తెస్తామని మంత్రి స్వామి హామీ ఇచ్చారే కానీ దాని అమలుపై దృష్టిసారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఫలితంగా వచ్చే విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు అద్దెభవనంలోనే అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. పనులు ఆగిపోయిన అసంపూర్తి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement