శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయ భవనం
పామూరు:
ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన విజ్ఞాన భాండాగారం శిథిలావస్థకు చేరుకుంది. నిరుద్యోగ యువతకు, విద్యార్థుల పోటీ పరీక్షలకు బాసటగా నిలవాల్సిన గ్రంథాలయం పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతోంది. 1960 సంవత్సరంలో పామూరు పట్టణం దేవాలయాల వీధిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన విజ్ఞాన ఆలయం 66 సంవత్సరాలుగా అద్దెభవనంలోనే నడుస్తోంది. 1973 వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థలో విలీనం చేశారు. అప్పట్లో లైబ్రరీకి వచ్చే వారి సంఖ్య ఎక్కువకావడంతో స్థలాభావంతో దానిని స్థానిక పొట్టిశ్రీరాములు వీధిలోని మరో అద్దెభవనంలోనికి మార్చారు. ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థకు చేరుకుని కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. పెద్ద వర్షానికి భవనం పైకప్పు నుంచి నీరు కారుతూ విలువైన పుస్తకాలు తడిసి పాడయ్యే దుస్థితి నెలకొంది. రెగ్యులర్ లైబ్రేరియన్ 2012 మే నెలలో పదవీ విరమణ చేయడంతో కొంతకాలం హనుమంతునిపాడు గ్రంథాలయం లైబ్రేరియన్‌ని, ఆ తర్వాత వెలిగండ్ల గ్రంథాలయం లైబ్రేరియన్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. సదరు ఇన్‌చార్జి సోమ, గురు వారాలు రెండు రోజులే గ్రంథాలయంలో పనిచేస్తూ మిగతా దినాల్లో మూసివేసి ఉండటం, గ్రంథాలయానికి పోవాలంటే ఎక్కే మెట్లు శిథిలమై ప్రమాదకరంగా ఉండటంతో పుస్తక ప్రియులకు గ్రంథాలయానికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం లైబ్రరీలో 983 మంది సభ్యులు ఉండగా 9,808 వివిధ రకాల పుస్తకాలున్నాయి. ఇదిలా ఉండగా గ్రంథాలయానికి సొంత భవనం నిర్మించేందుకు గతంలో పామూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత సోమయాజులు తనకు ప్రభుత్వం నివేశనా స్థలం కింద ఇచ్చిన స్థలాన్ని గ్రంఽథాలయ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం దాతలు ఇచ్చిన స్థలం క్రమేణా ఆక్రమణలకు గురవుతోంది. తక్షణం నూతన భవనానికి నిధులు మంజూరు చేయించి గ్రంథాలయం శాశ్వత భవనంలో ఏర్పాటు చేయాలని విద్యార్థులు, మండల ప్రజలు కోరుతున్నారు.


