ఒంగోలు సిటీ: జిల్లాలోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం జీవితాంతం చేసిన త్యాగాలకు ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగ చేస్తారని అన్నారు. పేదలకు దాన ధర్మాలు, త్యాగం, ప్రేమ, సత్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
● గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ వెంట జిల్లా డీఆర్‌ఓ శ్రీధర్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు తహశీల్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒంగోలు తహశీల్దార్‌గా పనిచేస్తున్న పిన్నిక మధుసూదనరావు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. ఈయన జిల్లాలోని కొమరోలు, పెద్దారవీడు, చీమకుర్తి, కొత్తపట్నంలలో తహశీల్దార్‌గా పనిచేశారు. కొత్తపట్నంలో తహశీల్దార్‌గా పనిచేస్తూ ఒంగోలుకు బదిలీపై వచ్చారు. మరొకరు కలెక్టరేట్‌లో ల్యాండ్ సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న షేక్ మహమ్మద్ హుస్సేన్‌కు కూడా డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈయన పాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, బేస్తవారిపేట, మద్దిపాడు, పొన్నలూరు, గుడ్లూరు, ఉలవపాడు, సీఎస్ పురంలలో తహశీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం కలెక్టర్‌లో సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు, వీరిరువురికి వారం రోజుల్లో డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇవ్వనున్నారు.
మార్కాపురం: జనగణన, గృహ గణన కార్యక్రమంలో భాగంగా అధికారులు సర్వేకు వెళ్లినప్పుడు పలు గృహాలకు తాళం వేయడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా సుమారు 10,180 గృహాలకు తాళాలు వేసినట్టు సిబ్బంది గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాలు, 4 నియోజకవర్గాలను 2222 బ్లాకులుగా విభజించి, 2222 సిబ్బందిని కేటాయించి గృహ గణన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 1 నుంచి ప్రారంభించిన కార్యక్రమం నెలాఖరుతో పూర్తికావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 13,27,117 మంది జనాభా ఉన్నట్లు అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 4,13,863 ఇళ్లను సర్వే చేయాలని అధికారులు అంచనా వేయగా 4 లక్షల 6 వేల గృహాల గణన పూర్తిచేశారు. గృహ గణన కార్యక్రమంలో వెలిగండ్ల మండలం జిల్లా వ్యాప్తంగా చూస్తే తడబడుతోంది. ఇక్కడ మొత్తం 9620 గృహాలకు గాను 7756 గృహాలను లెక్కించగా 591 గృహాలు తాళం వేసినట్టుగా గుర్తించారు. పొదిలి మండలంలో 16,950 గృహాలు ఉండగా 500 గృహాలకు తాళంవేసినట్టు గుర్తించారు. సీఎస్‌పురంలో 12,367 గృహాలు ఉండగా 265 గృహాలకు తాళాలు వేసి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా కంభంలో 1012 గృహాలకు డోర్‌లాక్ వేసినట్టు గుర్తించారు. ఆ తరువాత పామూరులో 658 గృహాలకు డోర్‌లాక్ వేశారు. గిద్దలూరులో 516 గృహాలకు తాళాలు వేయగా, కొనకనమిట్లలో 612 గృహాలకు డోర్‌లాక్ ఉన్నట్టు గుర్తించారు. ఇలా డోర్‌లాక్ ఉన్న గృహాలను గుర్తించడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. మరోవైపు అధికారులు సిబ్బందికి టార్గెట్లు నిర్ణయించి త్వరగా పూర్తిచేయాలని ఒత్తిడి తెస్తున్నారు.


