కందుకూరు: పొగాకు రైతులకు మద్దతుగా ఆందోళన చేసిన వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం దుర్మార్గమని, వైఎస్సార్‌సీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతులకు అండగా నిలిచేందుకు వేలం కేంద్రాన్ని సందర్శించామన్నారు. రైతు నాయకుడి ముసుగులో ఉన్న అధికార పార్టీకి చెందిన నేత రైతుల ఆందోళనలు పక్కదారి పట్టించేందుకు, గిట్టుబాటు ధరలు రాకపోతే ప్రభుత్వానికి ఏం సంబంధం అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన అధికార పార్టీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. పొగాకు రైతుల ఆందోళనలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే వారిపై అభాండాలు వేస్తూ తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం దారుణమని, ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా రైతు ప్రతినిధులుగా వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బుర్రా డిమాండ్ చేశారు.


